- ఉట్నూర్లో ఇద్దరు అరెస్ట్
గుడిహత్నూర్(ఉట్నూర్), వెలుగు: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఐఫోన్, ఖరీదైన మొబైల్ ఫోన్లు, ప్లాట్ల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన సయ్యద్ జావీద్, ఘన్‌పూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ కొత్తపెల్లి గంగాధర్ కలిసి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మించారు. ఒక యాప్ ద్వారా లాభాలు వస్తున్నట్లుగా నకిలీ లెక్కలు చూపిస్తూ ఉట్నూర్ పరిసర గ్రామాలకు చెందిన సుమారు 25 మంది నుంచి రూ.కోటి 19 లక్షల 4 వేలు వసూలు చేశారు.
బాధితుల నుంచి సేకరించిన డబ్బుతో నిందితులు ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. శ్యాంపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి మనోజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద మూడు ఖరీదైన మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
