
పార్లమెంట్ లో ఏ బిల్లుపై ఓటింగ్ జరిగినా… సభలో తలుపులు మూస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే అన్నారు పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కామెంట్స్ ను ఆయన తప్పుపట్టారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఐదుసార్లు తెలంగాణ ఏర్పాటును అమిత్ షా ప్రస్తావించారన్నారు. లోక్ సభలో దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అనడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కూడా మద్దతిచ్చిందనీ.. ఇప్పుడెందుకు తప్పుపడుతుందో అర్థం కావడం లేదన్నారు. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 వర్తింపుపై ఆనాడు నెహ్రూ చేసింది కరెక్టే అనీ.. బీజేపీ చరిత్రను వక్రీకరించి చెబుతోందని అన్నారు ఉత్తమ్.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియామకాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ అత్యంత క్లిష్ట సమయంలో అధ్యక్షుడుగా పని చేశారని చెప్పారు. రాహుల్ అందించిన సేవలు పార్టీని ఎంతో బలోపేతం చేశాయన్నారు.