ప్రభుత్వం రూ.35 వేల కోట్ల నిధులు మళ్లించింది : ఉత్తమ్

ప్రభుత్వం రూ.35 వేల కోట్ల నిధులు మళ్లించింది : ఉత్తమ్

రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించి.. నిధులు విడుదల చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన ఫండ్స్ ను సైతం పక్కదారి పట్టించడం దుర్మార్గమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం సరైన పద్థతి కాదని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన రూ.35 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి.. మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల కోసం విడుదల చేయాల్సిన రూ.250 కోట్ల నిధులను 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో సర్పంచులు, ఉపసర్పంచులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు పెండింగ్‭లో ఉండటం వల్ల సర్పంచ్‭లు, ఉపసర్పంచ్‭లు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.