గరిడేపల్లి, నేరేడుచర్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రపంచస్థాయి ఆదర్శ విద్యాసంస్థలుగా నిలవబోతున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి సమీపంలో 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ స్కూల్‌ను ఈ ఏడాది చివరికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 5.36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2500 మంది విద్యార్థులకు వసతి, హాస్టళ్లు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నాణ్యతపై రాజీ లేదని, నెలకొకసారి తానే తనిఖీ చేస్తానని చెప్పారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో 404 స్వయం సహాయక మహిళా సంఘాలకు 52.07 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులు, 5,498 మహిళలకు ఇందిరమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రహదారులు, విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు హుజూర్‌నగర్‌లో రూ. 7.50 కోట్లతో జూనియర్ కాలేజీలను, రూ. 4.50 కోట్లతో డిగ్రీ కాలేజీ భవనాలు నిర్మించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 2.5 కోట్లతో సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
హుజూర్‌నగర్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తే 40 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 4500 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు భరోసానిస్తాయన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్పీ కే నరసింహ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్, ఆర్ అండ్ బీ ఈఈ సీతారామయ్య, ఆర్డీవో శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈనెల 23న హుజూర్ నగర్ అగ్రికల్చర్ కాలేజ్ కు శంకుస్థాపన
హుజూర్ నగర్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ లో ఏర్పాటు చేయనున్న అగ్రికల్చరల్ కాలేజీని ఈనెల 23న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన హుజూర్ నగర్ మండల పరిషత్ ఆఫీసు ఆవరణలో వడ్డీ లేని రుణాల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 365 స్వయం సహాయక సంఘాలకు రూ.1,36,62,586 చెక్కులను అందజేశారు. జిల్లాలోని 109 మంది దివ్యాంగులకు రూ. 1.09 కోట్ల విలువ చేసే దివ్యాంగుల పరికరాలను కోదాడ నియోజకవర్గానికి చెందిన 50 మందికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రికల్చరల్ కాలేజ్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.124 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాలేజీ ఏర్పాటు కోసం రైతుల వద్ద నుంచి సేకరించిన100 ఎకరాల భూమిని అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులకు రెవిన్యూ అధికారులు అందజేసినట్లు తెలిపారు.
హుజూర్ నగర్ లో 912మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల కింద రూ. 272 కోట్లు, స్త్రీ నిధి కింద 785 సంఘాలకు రూ. 32. 60 కోట్లు, స్వయం ఉపాధి కింద 127 సంఘాలకు రూ.1.90 కోట్ల రుణాలను అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్పీ కే. నరసింహ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా దేశ్ ముఖ్, ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
