హరీశ్ రావు అబద్ధాలు మానుకో .. వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు: మంత్రి ఉత్తమ్​

హరీశ్ రావు అబద్ధాలు మానుకో .. వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు: మంత్రి ఉత్తమ్​
  • ఇప్పటికే 43.10లక్షల టన్నులు కొన్నం
  • గతేడాది, రెండేండ్ల కంటే ఎక్కువ కొనుగోళ్లు చేశామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు అబద్ధాలతో ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నాలను మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి, సమర్థవంతమైన కొనుగోళ్లతో వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. వడ్ల కొనుగోళ్లపై సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఉత్తమ్ ఖండించారు. హరీశ్​రావు ప్రతిరోజూ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ, యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన రికార్డు స్థాయి కొనుగోళ్ల వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటి వరకు 65 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 43.10 లక్షల టన్నుల  ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందన్నారు. గత యాసంగి సీజన్ 2023–-24లో 29.88లక్షల టన్నులు, 2022–23లో 19.62 లక్షల టన్నుల సేకరణతో పోలిస్తే, ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 44 శాతం అధికం, రెండేండ్ల క్రితంతో పోలిస్తే 120 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగాయి. 2022–23తో పోలిస్తే 23.48 లక్షల టన్నులు, గతేడాదితో పోలిస్తే 13.22 లక్షల టన్నులు అధిక ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు.

గతేడాది కంటే వెయ్యి సెంటర్లు ఎక్కువ

రాష్ట్రవ్యాప్తంగా 8,245 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందనీ, ఇది గతేడాది (7,178) కంటే 1,067 కేంద్రాలు అధికమని తెలిపారు. ఇప్పటివరకు 6.58 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, సేకరించిన ధాన్యంలో 27.75 లక్షల టన్నుల దొడ్డు రకం, 15.35 లక్షల టన్నుల సన్నరకం ఉన్నాయి. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.9,999.36 కోట్లు కాగా, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.6,671 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు పూర్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం అందిస్తున్నది, ఇందుకోసం రూ.767 కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలినప్పటికీ, వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధించడం రికార్డు విజయమని అభివర్ణించారు. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల టన్నులు, యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో 127 లక్షల టన్నులు దిగుబడి వచ్చినట్లు వివరించారు.