రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ భ్రష్టు పట్టించారు: ఉత్తమ్

రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ భ్రష్టు పట్టించారు: ఉత్తమ్

రాష్ట్ర రాజకీయాలను సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టించారని అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన…  ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటినుంచి కూడా కేసీఆర్ తన స్వార్థం కోసం మాత్రమే పనిచేశారని అన్నారు. ప్రస్తుతం 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెధిరించి టీఆర్ఎస్ లోకి గుంజుకుపోయారని అన్నారు. దళిత లీడర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం జీర్ణించుకోక పోవడం వల్లనే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని తెలిపారు. కేసీఆర్ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని అన్నారు.

కాంగ్రెస్ నుంచి డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలతో సీఎల్పీని రద్దు చేయమంటూ రహస్య ప్రదేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిటీషన్ తీసుకున్నారని అన్నారు ఉత్తమ్. ఈ రోజు మద్యాహ్నం 3గంటలకు పిటీషన్ తీసుకుని 6 గంటల వరకు మర్జ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారని ఉత్తమ్ తెలిపారు. తాను స్పీకర్ కు చాలా సార్లు ఫోన్ చేశానని అయినా తాను ఫోన్ లో అందుబాటులోకి రాలేదని చెప్పారు.

టీఆర్ఎస్  పార్టీలో పైలెట్ రోహిత్ రెడ్డి చేరకపోతే అతని పై కేసీఆర్ క్రిమినల్ కేసు పెడతానంటూ బెధిరించారని అన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారెవరూ కూడా పొలిటికల్  ఫార్మాట్ లో వెళ్లలేదని అందరినీ కూడా బయపెట్టి కొనుగోలు చేశారని ఆయన అన్నారు. రేపు తాము హైకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు ఉత్తమ్. లోక్ పాల్ లో ఎమ్మెల్యేల కొనుగోలులో అవినీతి జరిగిందని నిరూపిస్తామని తెలిపారు.