
- కార్పెట్ షాపులో అక్రమంగా క్రాకర్స్ తయారీ
- పేలుడుతో కుప్పకూలిన నాలుగు బిల్డింగ్స్
భదోహి: ఉత్తరప్రదేశ్ లోని ఓ షాపులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. దాని ఎఫెక్ట్ తో ఒక్కసారిగా రెండంతస్తుల షాప్ సహా నాలుగు బిల్డింగ్స్ కుప్పకూలాయి. ఈ ఘటనలో మొత్తం 10 మంది మరణించారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి భారీ శబ్దంతో గాలిలోకి దుమ్ము లేచింది. పేలుడుతో భూమి కంపించింది. గుండెలదిరేలా వచ్చిన సౌండ్ తో చుట్టుపక్కల వారంతా ఏదైనా బాంబు పేలిందేమోనన్న భయంతో పరుగులు పెట్టారు.
అక్రమంగా క్రాకర్స్ తయారీ
పేలుడు జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. సహాయ చర్యలు మొదలుపెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రోహ్తా బజార్ లోని కలియా మన్సూరి అనే వ్యక్తి షాప్ అది. వాస్తవానికి అది కార్పెట్ షాపు అయితే దాంట్లో అక్రమంగా క్రాకర్స్ తయారు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రాకర్స్ పేలి ఉండొచ్చని, దాని వల్ల పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లు కూడా కూలిపోయాయని చెప్పారు.
మృతులను కలియా మన్సూర్, ఇర్ఫాన్ మన్సూరి, అబిద్ మన్సూరి, చందు గా గుర్తించారు. మిగిలిన ఆరుగురు ఎవరన్నది తెలియాల్స ఉందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు, ఎన్డీఆర్ఎఫ్ టీం స్పాట్ కు చేరుకున్నాయని తెలిపారు. అక్రమ కాక్రర్స్ తయారీనే పేలుడుకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు.