శ్మశానం లేక.. శవాలను ఇళ్లలోనే పూడుస్తున్నారు

శ్మశానం లేక.. శవాలను ఇళ్లలోనే పూడుస్తున్నారు

అక్కడ ఇళ్లే శ్మశానాలు. హాలు, బెడ్రూం, కిచెన్​, వరండా.. ఎక్కడ వీలైతే అక్కడే సమాధులు. ఆ సమాధులతోనే ఇంటోళ్ల సావాసం. వంట దగ్గర్నుంచి తినేదాకా, నడిచే దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా వాటితోనే దోస్తానా. కారణం, ఆ ఊరికి శ్మశానమంటూ లేకపోవడం. అందుకే ఆ ఊరోళ్లు చనిపోయిన తమ కుటుంబీకులను ఇళ్లలోనే సమాధి చేస్తున్నారు. ఆ ఊరు ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రా జిల్లాలో ఉన్న చా పోఖర్​. జ్వరంతో చనిపోయిన తన 10 నెలల కొడుకు సహా ఐదుగురిని తమ ఇంటి పెరట్లో పూడ్చి పెట్టారని రింకీ బేగం అనే మహిళ చెప్పింది. తమ లాంటి పేదోళ్లకు చావులోనూ గౌరవం దక్కదని, చాలీచాలని స్థలంలో ఇళ్లు కట్టుకున్న తాము అదే స్థలంలో చనిపోయిన వాళ్లను పూడ్చి సమాధులు కట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని గుడ్డి అనే మరో మహిళ కన్నీరుపెట్టుకుంది. సమాధుల మీద కూర్చోవడం, పక్కనే వంట చేయడం, అక్కడి నుంచే నడవడం, వాటి మీద పడుకోవడం తమకు మామూలు అయిపోయిందని చెప్పింది.

ఏళ్లు గడుస్తున్నా పట్టింపే లేదు
ఊళ్లోని ముస్లింలకే ఇంత పెద్ద కష్టం వచ్చిపడింది. వాళ్లంతా పేదోళ్లే.  కూలీ నాలి చేసుకుంటే తప్ప రోజు గడవని పరిస్థితి. ఓ శ్మశానాన్ని ఏర్పాటు చేయండి సాబ్‌ అని కొన్నేళ్ల క్రితం పెట్టుకున్న అర్జీ.. అర్జీగానే ఉండిపోయింది. కొన్నేళ్ల క్రితం ఓ స్థలాన్ని అధికారులు కేటాయించినా, అదీ చెరువు మధ్యలో ఇచ్చారు. అక్కడే అధికారుల అలసత్వం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సమాధులతో అక్కడి ఇళ్లు దాదాపు నిండిపోయాయని, స్థలం లేకుండా పోతోందని, వెంటనే శ్మశానానికి మంచి స్థలం ఇవ్వాలని ఊరోళ్లు డిమాండ్​ చేస్తున్నారు. డిమాండ్లే కాదు, ఆందోళనలూ చేసిన సందర్భాలున్నాయి.

2017లో మంగళ్​ ఖాన్​ అనే వ్యక్తి చనిపోతే, శ్మశానం కేటాయించే వరకూ సమాధి చేయబోమని అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారులొచ్చి నచ్చజెప్పడంతో చెరువు పక్కన అతడి మృతదేహాన్ని పూడ్చారు. ‘‘చనిపోయిన మా వాళ్లను పూడ్చేలా కొంత స్థలం ఇవ్వాలన్నది మా డిమాండ్​. మేం మా కుటుంబ సభ్యుల శవాల సమాధులతో సావాసం చేస్తున్నాం” అని మునిం ఖాన్​ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు చా పోఖర్​కు పక్కనే ఉన్న సనన్​ గ్రామం, అచ్నేరా టౌన్​లలో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారు ఊరోళ్లు. అయితే, అక్కడా సమాధులు పెరిగి స్థలం కొరత ఏర్పడింది. ముస్లింలకు శ్మశానాన్ని కేటాయించాల్సిందిగా ఇప్పటికే చాలా సార్లు అధికారులను కోరామని, అయినా కూడా స్పందన లేదని ఊరి పెద్ద సుందర్​ కుమార్​ చెప్పాడు. ఈ సమస్య గురించి తనకు తెలియదని ఆగ్రా కలెక్టర్​ రవి కుమార్​ ఎన్​జీ తెలిపారు. అధికారులను పంపి స్థలాన్ని ఇప్పిస్తానని చెప్పారు.