
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మామూలే. కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. అలుగుతారు.. మళ్లీ కలిసిపోతారు. కానీ, భార్య కొడుతోందని ఏ భర్త అయినా చెట్టెక్కి కూర్చుంటాడా? అదీ ఒకటి రెండు రోజులు కాదు నెల రోజుల నుంచి! ఉత్తరప్రదేశ్లోని మవు జిల్లా బసరత్పూర్లో రామ్ ప్రవేశ్ అనే నడివయసు వ్యక్తి ఇలాగే నెల రోజుల నుంచి తాటిచెట్టు మీదనే ఉంటున్నాడు. ఇంట్లోవాళ్లు, ఊళ్లోవాళ్లు ఎంత నచ్చచెప్పినా దిగడం లేదు. ఏదైనా అవసరం పడితే అర్ధరాత్రి కిందకి దిగి, మళ్లీ ఎక్కుతున్నాడు.
పెళ్లైనప్పటి నుంచి తన కొడుకుతో కోడలు రోజూ గొడవ పడుతోందని, అప్పుడప్పుడు కొడుతోందని, అది తట్టుకోలేకే ఇలా చెట్టెక్కాడని ప్రవేశ్ తండ్రి విన్సురామ్ అంటున్నాడు. రామ్ ప్రవేశ్కు కావాల్సిన తిండిని ఒక తాడుతో చెట్టుపైకి చేరుస్తున్నారు భార్య, కొడుకు. అయితే, రామ్ ప్రవేశ్ చెట్టు మీద ఉండడంపై ఊళ్లోని ఆడవాళ్లు మండిపడుతున్నారు. ఊరి మధ్యలో ఉన్న ఆ తాటిచెట్టు వంద అడుగుల ఎత్తున ఉంటుంది. దానిపై నుంచి చూస్తే దాదాపు అన్ని ఇండ్లూ కనిపిస్తాయి. అందువల్ల తమ ప్రైవసీకి ఇబ్బందిగా ఉందంటూ పోలీసులకు కంప్లైంటు ఇచ్చారు. దాంతో అతడ్ని ఎలాగైనా కిందకు దించాలని చూస్తున్నారు పోలీసులు.