దేవ‌త అంటూ మ‌హిళ‌ హ‌ల్ చ‌ల్

దేవ‌త అంటూ మ‌హిళ‌ హ‌ల్ చ‌ల్

దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నా.. కొన్నిచోట్ల పోకిరీలు రూల్స్ పాటించ‌డంలేదు. అవ‌స‌రంలేకున్నా రోడ్డుమీదికొచ్చి పోలీసుల చేత దెబ్బ‌లు తింటున్నారు. అయితే ఓ మ‌హిళ లోప‌లికి వెళ్ల‌కుండా తాను దేవ‌త‌ను అంటూ హ‌ల్ చ‌ల్ చేసింది. నేను ఆదిశక్తిని. దమ్ముంటే నన్ను ఇక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నించండి.. అంటూ మహిళ పోలీసులకు సవాలు విసిరింది.  ఈ ఘటన గురువారం ఉత్తరప్రదేశ్ లో జ‌రిగింది.

తనను తాను దేవతగా చెప్పుకొనే మహిళ మెహ్దా పూర్వాలోని తన నివాసం వద్ద సమావేశం ఏర్పాటు చేసి.. తన అనుచరులను ఆహ్వానించింది. దీంతో వంద మంది అక్కడ గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో లాఠీ చార్జీ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. ఈ క్రమంలో సదరు మహిళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేస్తామని హెచ్చరించినా వినకుండా వారిపైకి కత్తిదూసింది. దీంతో మహిళా పోలీసులు ఆమెను కట్టడి చేసి.. లాక్కెళ్లి పోలీసు వాహనం ఎక్కించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాష్ట్రాలన్నీ పకడ్బందీగా లాక్ డౌన్‌ అమలు చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదని నిబంధనలు విధించాయి. ఒకవేళ ఎవరైనా అనవసరంగా రోడ్లపై తిరిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.