సహజీవనం చట్టబద్దం ఇండియాలోనే ఈ రాష్ట్రం తొలిసారిగా అమలు

సహజీవనం చట్టబద్దం ఇండియాలోనే ఈ  రాష్ట్రం తొలిసారిగా అమలు

ఉత్తరాఖండ్ ప్రభుత్వం యునిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు (మార్చి 13) నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇండియాలో UCC అమలు  చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ చరిత్ర సృష్టించింది. గత నెలలో అసెంబ్లీ ఈ బిల్లును పాస్ చేసింది. ఇప్పుడు ఆ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ చట్టం ప్రకారం లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్లు రాష్ట్రంలో ఉన్నా ఇతర రాష్ట్రాల వారైనా సరే తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలి. సహజీవనం చేసిన వాళ్లకి పుట్టిన పిల్లలను సక్రమ సంతానంగానే పరిగణిస్తారు. కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తరవాత మహిళను దూరం పెడితే కచ్చితంగా వాళ్లకు భరణం ఇవ్వాల్సి ఉంటుందని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. 

లివిన్ రిలేషన్‌షిప్స్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష విధించేలా కఠిన నిబంధన చేర్చారు. ఇక భర్త అత్యాచారం చేసినా, లేదంటే అసహజ శృంగారానికి పాల్పడాలని ఒత్తిడి తెచ్చినా, ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నా విడాకులు ఇచ్చే హక్కులు భార్యకి కల్పించింది ఈ చట్టం. బహుభార్యత్వంతో పాటు హలాలా సంప్రదాయాన్నీ ఈ చట్టం నిషేధించనుంది. కొన్ని ముస్లిం వర్గాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాల్ని పాటిస్తున్నాయి. 

దీని కారణంగా మహిళలకు అన్యాయం జరుగుతోందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావించింది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే...ఈ చట్టం గిరిజన వర్గాలకు మాత్రం వర్తించదని తెలిపింది. వాళ్ల ఆచారాలను, సంప్రదాయాలను కాదనే అధికారం లేదని వివరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలుకు ఇప్పటికే చర్చ జరుగుతోంది. గుజరాత్, అసోంలోనూ UCC అమలు చేసే అవకాశాలున్నాయి.