అంకితా భండారి హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

అంకితా భండారి హత్య కేసులో మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

ఉత్తరాఖండ్ : రిసెప్షనిస్ట్ అంకితా భండారి (19) హత్య కేసు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యువతి హత్యపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని రిసార్ట్‌ల నిర్వాహకులను విచారించాలని జిల్లా మేజిస్ట్రేట్‌లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్ట్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి రేణుకాదేవి ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసినట్లుగా సీఎం వెల్లడించారు. అంకితా భండారి హత్య కేసులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటుగా, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పుల్కిత్ ఆర్య ఉత్తరాఖండ్ మాజీ మంత్రి వినోద్ ఆర్య కుమారుడు.  

సెప్టెంబర్ 18న అదృశ్యం 

రిషికేశ్‌లోని వనతార రిసార్ట్‌ లో అంకితా భండారి రిసెప్షనిస్టుగా పని చేసేది. సెప్టెంబర్ 18వ తేదీన ఆమె అదృశ్యమైంది. దీంతో  అంకిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యను ప్రధాన నిందితుడిగా తేల్చారు. ఓ వివాదం కారణంగా అంకితా భండారిని చిల్లా కాలువలోకి తోసేసినట్లు నిందితులు పోలీసు విచారణలో చెప్పారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం వనతార రిసార్ట్‌ను కూల్చేయాలని ఆదేశించింది. సీఎం ఆదేశాల మేరకు బుల్డోజర్లతో పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్టును కూల్చేశారు. 


 అంకితా భండారి మృతదేహం లభ్యం 

ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్  మొదలుపెట్టిన ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు అంకితా భండారి మృతదేహన్ని రిషికేశ్‌లోని  బ్యారేజీ నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత డెడ్ బాడీని ఎయిమ్స్‌కు తరలించారు.

రిసార్టుకు నిప్పటించిన స్థానికులు

అంకితా భండారి హత్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను ఆరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకుని నిందితులపై దాడి చేశారు. రిసార్టుకు నిప్పటించారు. 

పుల్కిత్ ఆర్య తండ్రిపై బీజేపీ వేటు
ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్య తండ్రి, సోదరుడు వినోద్ ఆర్య, అంకిత్ ఆర్యలను బీజేపీ తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించింది.