ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. భారీ వర్షాలకు ఊరు ఊరే కొట్టుకుపోయింది..!

ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. భారీ వర్షాలకు ఊరు ఊరే కొట్టుకుపోయింది..!

అవి వానలు కావు.. ఆ వరదలు మునుపెన్నడూ చూసి ఉండరు ఆ ప్రజలు. ఏకంగా ఊరు ఊరే కొట్టుకుపోయిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వర్షాలు ఎలా అతలాకుతలం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం (ఆగస్టు 22) అర్థరాత్రి ప్రాంతంలో వచ్చిన వానలకు కొండచరియలు కూలిపోయాయి. పెద్దపెద్ద రాళ్లూ, భారీగా బురద కొట్టుకొచ్చి గ్రామాన్ని కమ్మేసింది. భారీ వరదకు ఏకంగా ఊరు ఊరే కొట్టుకోపోయింది. ఇప్పుడు అక్కడ కూలిని శిథిలాలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ మిగలని పరిస్థితి. 

చమోలి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలు చాలా గ్రామాలను అల్లకల్లోలం చేశాయి. గ్రామాల్లో ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి. తరలీ మార్కెట్, కోట్ దీప్, తరలీ మండల కార్యాలయం అన్నీ ధ్వంసం అయ్యాయి. చాలా మంది ప్రజలు వరదలో కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. 

భారీగా వచ్చిన వరద కారణంగా కార్లు, బైకులు కొట్టుకుపోగా.. చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. సగ్వారా గ్రామంలో 20 ఏళ్ల యువతి బురదలో సమాధి అయ్యిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.  మొత్తం పది నుంచి 12 ఇండ్లు బురదలో కూరుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

చెడ్పాన్ మార్కెట్ ఏరియాలో మరో వ్యక్తి మిస్సైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. తున్నీ గధేరా లో భారీ వరదల కారణంగా ఇళ్లు కొట్టుకుపోయి పిందార్ నది వరకు శిథిలాలు చేరుకున్నాయని తెలిపారు. తరలీ ఏరియాను అనుసంధానం చేసే కర్ణప్రయాగ్-గ్వాల్దాం నేషనల్ హైవే మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. అదే విధంగా తరలీ-సగ్వారా, డుంగ్రీ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. 

అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కానీ కొట్టుకుపోయిన వారి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదని చెబుతున్నారు స్థానికులు . రాష్ట్రంలోని పలు జిల్లాలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరకేంద్రం హెచ్చరించింది. డెహ్రడూన్, చమోలీ, రుద్రప్రయాగ్, ఆల్మోరా, నైనిటాల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.