ఉత్తరకాశిలో సహాయక చర్యలు..మృతదేహాల గుర్తింపులో కాడావర్ డాగ్స్

ఉత్తరకాశిలో సహాయక చర్యలు..మృతదేహాల గుర్తింపులో కాడావర్ డాగ్స్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరాకాశీ జిల్లాలో ధరాలిలో క్లౌడ్ బరస్ట్ తో ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో అదృశ్యమైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. మృతదేహాలను గుర్తించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF) మొదటిసారి కాడావర్ డాగ్స్ స్క్వాడ్ను(Cadaver Dog Squad) రంగంలోకి దింపింది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కల బృందం మృతదేహాల వాసనను పసిగట్టి గుర్తిస్తాయి. 

ఢిల్లీ నుండి ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెండు కుక్కలను విమానంలో ధరాలికి తరలించారు. ఈ కుక్కల బృందాలు గల్లంతైనవారిని గుర్తించే ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 35 మంది సిబ్బందితో కూడిన మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మరో రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు డెహ్రాడూన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. అవసరాన్ని బట్టి వాటిని కూడా ఎయిర్‌లిఫ్ట్ చేయనున్నారు.

►ALSO READ | హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..వరదల్లో చిక్కుకుపోయిన 400 మంది యాత్రికులు

ఎన్‌డీఆర్‌ఎఫ్ చరిత్రలో మృతదేహాలను గుర్తించేందుకు కుక్కల బృందాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ కుక్కలు ప్రత్యేక శిక్షణ పొందినందున అవి మానవ కళ్ళకు కనిపించని ప్రదేశాలలో కూడా మృతదేహాలను సులభంగా గుర్తించగలవు.

NDRF దాదాపు అర డజను కాడావర్ డాగ్స్కి శిక్షణ ఇచ్చింది. వీటిలో ఎక్కువగా బెల్జియన్ మాలినోయిస్ ,లాబ్రడార్ జాతులకు చెందినవి. శిక్షణ ప్రయోజనాల కోసం కుళ్ళిపోతున్న మానవ శరీరం వాసనను దగ్గరగా గుర్తించేలా విదేశాల నుంచి ప్రత్యేక సువాసనను దళం తీసుకువచ్చింది.