హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..వరదల్లో చిక్కుకుపోయిన 400 మంది యాత్రికులు

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..వరదల్లో చిక్కుకుపోయిన 400 మంది యాత్రికులు

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కిన్నెర జిల్లాలోని ఫూ బ్లాక్‌లోని రిబ్బా నల్లా సమీపంలోని రాల్దాంగ్ ఖాడ్ దగ్గర ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో నేషనల్ హైవే 5 పూర్తిగా మూసుకుపోయింది. హైవేను క్లియర్ చేసేందుకు స్థానిక అధికారులు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. 

మరోవైపు కిన్నెర కైలాష్ యాత్ర సందర్భంగా కాంగ్రాంగ్ నల్లా దగ్గర వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 400 మంది యాత్రికులను రక్షించారు. చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో పోర్టబుట్ లైట్లతో సహాయక చర్యలు చేపట్టారు. 9 గంటలపాటు శ్రమించి  యాత్రికులను కాపాడామని స్థానిక అధికారులు Xలో పోస్ట్ షేర్ చేశారు.   

హిమాచల్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు..

హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సిమ్లా, సోలన్, మండి, బిలాస్‌పూర్, ఉనా, హమీర్‌పూర్,కాంగ్రా వంటి జిల్లాలకు ఈ విషయంలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. 

►ALSO READ | పాక్కు అమెరికా ఆయుధాలివ్వడం కొత్తేంకాదు

రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ (SEOC) ప్రకారం.. భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో మండి జిల్లా తీవ్రంగా నష్టపోయింది.జిల్లాలో 179 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.మండి--ధరంపూర్ రోడ్డు (NH 3) ,ఆటో నుంచి సైన్జ్ రోడ్డు (NH 305) సహా 295 రోడ్లు మూసివేశారు. మరో మూడు రోజులు భారీ వర్షాలున్నందున సహాయక చర్యల కోసం NDRF బృందాలు అప్రమత్తమయ్యాయి. 

హిమాచల్ ప్రదేశ్ కు రూ.1,852 కోట్ల నష్టం

జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం రూ.18వందల52 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 36 మంది గల్లంతయ్యారు. వర్షపాతం కారణంగా 1700 కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 360 విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు ,257 నీటి సరఫరా పథకాలకు ఆటంకం ఏర్పడింది.