
- 1971 నాటి న్యూస్ క్లిప్‌ను షేర్ చేసిన భారత్
న్యూఢిల్లీ: భారత్, పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధాలు సప్లయ్ చేసిందని ఇండియన్ ఆర్మీ సాక్ష్యాలతోసహా గుర్తుచేసింది. అప్పటి రక్షణ మంత్రి పార్లమెంటులో వెల్లడించిన విషయానికి సంబంధించిన 1971 నాటి పేపర్ క్లిప్‌ను మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెరికా, చైనా కలిసి పాకిస్తాన్‌కు తక్కువ ధరకే ఆయుధాలను సరఫరా చేశాయని, వాటినే బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న యోధులను అణిచివేసేందుకు పాకిస్తాన్ ఉపయోగించిందని ఆ క్లిప్‌లో ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడంపై అమెరికా విమర్శలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ.. అప్పటి వార్తా క్లిప్‌ను బయటపెట్టడం ద్వారా దీటుగా బదులిచ్చినట్లైంది.
పాక్‌కు అగ్గువకే ఆయుధాలు సప్లయ్..
ఆర్మీ పోస్ట్ చేసిన 1971 ఆగస్ట్ 5నాటి న్యూస్ పేపర్ క్లిప్ .. పాకిస్తాన్‌కు ఆయుధాలు అందించడంలో అమెరికా పోషించిన పాత్రను హైలైట్ చేసింది. 1971కి రెండు దశాబ్దాల ముందు కాలంలో పాక్‌కు అమెరికా 2 బిలియన్ డాలర్ల విలువైన వెపన్స్‌ను సప్లయ్ చేసినట్లు అందులో ఉంది. అప్పటి రక్షణ మంత్రి వీసీ శుక్లా రాజ్యసభకు చెప్పిన విషయాలు అందులో ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ అరాచకాలకు పాల్పడుతున్న సమయంలో సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా ఆపేసినప్పటికీ, అమెరికా మాత్రం తన మద్దతును పాకిస్తాన్‌కు కొనసాగించిందని పేర్కొన్నారు. నిరంతరం వెపన్స్ సప్లయ్ చేసిందని చెప్పారు. అమెరికాతోపాటు చైనా కూడా తక్కో రేటుకే పాక్‌కు వెపన్స్ అందించాయని రాజ్యసభకు ఆయన వెల్లడించారు.
ఈ విషయాలన్నీ న్యూస్ పేపర్ క్లిప్‌లో ఉన్నాయి. అప్పటిమాదిరిగా ఇప్పుడు కూడా పాక్ పట్ల అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇంతకాలం పాక్ వస్తువుల దిగుమతిపై 29 శాతం ట్యాక్స్ విధిస్తామని చెప్పిన ప్రెసిడెంట్ ట్రంప్.. తాజాగా 19 శాతానికి తగ్గించారు. మన దేశంపై మాత్రం 25 శాతం పన్నులు విధిస్తామని, రష్యా నుంచి ఆయిల్ కొనుడు ఆపకపోతే మరింత పెంచుతానని హెచ్చరిస్తున్నారు.