
యూపీ బీజేపీలో అసమ్మతి చెలరేగింది. ఆ పార్టీ నేత, మంత్రి దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు. దళితుడైన తనను పక్కకుబెట్టడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఖతిక్ ప్రకటించారు. మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వాల్లో అసంతృప్తి బయటపడడం చాలా అరుదు..అయితే ఏకంగా ఓ మంత్రే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
యోగి కేబినెట్ లో ఖతిక్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ‘‘నేను దళితుడిని కాబట్టే నాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను రాష్ట్రమంత్రిగా పనిచేయడం ద్వారా దళితవర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు. నన్ను ఏ సమావేశానికి పిలవడం లేదు. ఈ పరిణామాలు నన్ను బాధించాయి. అందుకే రాజీనామా చేస్తున్నాను’’ అని ఖతిక్ ప్రకటించారు.
ఇక తన ఓఎస్డీ అనిల్ కుమార్ బదిలీ పట్ల మంత్రి జితిన్ ప్రసాద సీఎం యోగిపై ఆగ్రహంతో ఉన్నారు. గతేడాది యూపీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే ఆయన నిర్వహిస్తున్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనిపై విచారణ చేపట్టిన సీఎం కార్యాలయం అధికారుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిని ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. అందులో జితిన్ ప్రసాద ఓఎస్డీ అనిల్ కుమార్ కూడా ఉన్నారు. దీంతో ఆయన కూడా రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.