భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి 18మంది పిల్లలు మృతి : ఉజ్బెకిస్తాన్

భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి 18మంది పిల్లలు మృతి : ఉజ్బెకిస్తాన్

భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్‌ను తాగిన 18 మంది పిల్లలు మరణించారని ఉజ్బెకిస్తాన్ ఆరోపించింది. ఈ దగ్గు మందులో ప్రమాదకరమైన పదార్థం ఉందని, తమ ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలిందని చెప్పింది. పిల్లలు తీసుకున్న ఈ సిరప్ నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందు డాక్ 1మాక్స్ గా నిర్థారించిన ఉజ్బెకిస్తాన్.. అందులో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిపింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వారి తల్లిదండ్రులు, ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు, పిల్లలకు ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ మొత్తంలో సిరప్‌ను పిల్లలకు అందించినట్లు కూడా పేర్కొంది. పిల్లలు, ఆసుపత్రిలో చేరే ముందు ఈ సిరప్‌ను 2-7 రోజుల పాటు ఇంట్లో 2.5 నుండి 5 ml మోతాదులో రోజుకు 3 నుండి 4 సార్లు తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువని మంత్రిత్వ శాఖ తెలిపింది. జలుబు తగ్గేందుకు కూడా ఆ తల్లిదండ్రులు పిల్లలకు ఈ సిరప్‍ను తాగించారని చెప్పింది.

డాక్-1 మ్యాక్స్ ట్యాబ్లెట్లు, సిరప్‍ను అమ్మకూడదని ఇప్పటికే ఉజ్బెకిస్థాన్ నిర్ణయించుకుంది. దీని అమలులో విఫలమైన ఏడుగురు ఉద్యోగులను కూడా విధుల నుంచి తొలగించినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా ఈ ఘటనపై భారత్‍ విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO - నార్త్ జోన్), ఉత్తర్ ప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్, లైసెన్సింగ్ అథారిటీ విచారణ చేస్తోందని సమాచారం. పిల్లల మరణాలపై అంచనా రిపోర్టు కావాలని ఉజ్బెకిస్థాన్‍ను ఆ సంస్థలు కోరాయి. భారత్ లో తయారైన సిరప్ తాగి వేరే దేశాల్లో పిల్లలు మరణించడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాసూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 70 మంది పిల్లలు చనిపోయిన ఘటన అక్టోబర్‌లో జరిగింది.