సారూ.!జర మారాలి.. కేసీఆర్ ఏడాది పాలనపై v6 వెలుగు సర్వే

సారూ.!జర మారాలి.. కేసీఆర్ ఏడాది పాలనపై v6 వెలుగు సర్వే
  • స్కీంలు అమలు కాకపోవడంపై అసంతృప్తి
  • అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే తగ్గిన ఆదరణ
  • అయినా నమ్మకం.. తీరు మారొచ్చన్న ఆశ
  • మార్పులేని కాంగ్రెస్
  • పుంజుకుంటున్న బీజేపీ
  • V-6– వెలుగు, ఇండియా ఇంటెన్షన్స్​ సర్వేలో తేలిన అంశాలివి

వెలుగు టీమ్టీఆర్​ఎస్​ ఏడాది పాలనపై జనంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఏడాది కింద 47 శాతం ఓట్లతో కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చింది. పబ్లిక్ రిపోర్ట్ లో 38 శాతం మంది మాత్రమే ఈ ఏడాది కాలంలో పాలన బాగుందని చెప్పారు. 49 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 శాతం మంది యావరేజ్​గా ఉందన్నారు.  ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, బీజేపీల కన్నా టీఆర్ఎస్​కు ఎక్కువ ఓట్​షేరే దక్కవచ్చు కానీ.. లోక్​సభ ఎన్నికల నాటి ఓట్​ షేర్​తో పోలిస్తే బాగా తగ్గుదల కనిపించింది. సర్వే ప్రకారం టీఆర్ఎస్​కు 39.5 శాతం ఓట్​షేర్, కాంగ్రెస్​కు 26.2 శాతం ఓట్​షేర్, బీజేపీకి 25.6 శాతం ఓట్​ షేర్​ వచ్చే అవకాశం ఉంది.  పథకాల విషయంలో కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, 24 గంటల కరెంటు సప్లై, రైతుబంధు, రైతుబీమా లాంటివి బాగున్నాయని ఎక్కువమంది మెచ్చుకున్నారు.

మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పే డబుల్ బెడ్రూం ఇండ్లు రాకపోవడంపై ఎక్కువమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, గొర్రెల పంపిణీ, మిషన్ భగీరథ, నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి లాంటి పథకాలు అందకపోవడంపై అసంతృప్తి ఉందని ఎక్కువ మంది చెప్పారు. చాలా ఎన్నికల హామీలు ఇంకా అమలుకాలేదన్న విషయాన్ని కూడా జనం స్పష్టంగా చెప్పారు. ఏడాది కాలంలో గ్రాఫ్ తగ్గడానికి ఇవన్నీ కారణం కాగా… ముందు ముందు పాలనలో మార్పు వస్తుందన్న ఆశతో ఉన్నట్లు 49 శాతం మంది, ఆ నమ్మకం లేదని 45 శాతం మంది చెప్పడం విశేషం.

తీరు బాలేదు… అయినా కరెక్టే

అంశాల వారీగా కొన్ని విషయాల్లో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు బాగోలేదని జనం సూటిగా చెప్పారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలో కార్మికులతో కేసీఆర్ వ్యవహారశైలి, చేసిన ప్రకటనలపై ఎక్కువమంది జనం అసహనం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలకు సాయం, ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలపైనా ఎక్కువ అసంతృప్తి కనిపించింది. మరోవైపు సానుకూల అంశాల్లో కేసీఆర్ ఏకపక్షంగా, మొండిగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరును సమర్థిస్తున్నట్లు ఎక్కువమంది చెప్పడం విశేషం.

ప్రతిపక్షం ఉండాల్సిందే

ప్రభుత్వం, పాలన ఎట్లా ఉన్నా రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా ఉండాలని ఎక్కువమంది చెప్పారు. కాంగ్రెస్ లో ఎక్కువమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో కలిసినా ఆ పార్టీకి ఉన్న ఆదరణలో పెద్దగా మార్పులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా 28 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 26 శాతం ఓటింగ్ వచ్చింది. అదే సమయంలో అసెంబ్లీలో ఒక సీటుకు పరిమితమైన బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 7 శాతం ఓటింగ్ మాత్రమే ఉన్న బీజేపీ పార్లమెంటు ఎన్నికల నాటికి 19 శాతానికి పైగా సాధించింది. పబ్లిక్ రిపోర్ట్ విశ్లేషణలో ప్రస్తుతం 25 శాతానికి పైగా ఆదరణ ఉన్నట్లు తేలింది. ప్రధానంగా యూత్ లో ఈ మొగ్గు కనిపిస్తోంది. వయసు, కులాలు, చదువు, ఆదాయం, చేసే పని ఆధారంగా జనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.