బెదిరింపులకు భయపడం క్షమాపణ చెప్పం ..కేసీఆర్ లీగల్ నోటీసుకు దీటుగా రిప్లై ఇచ్చిన ‘వీ6 వెలుగు’

బెదిరింపులకు భయపడం క్షమాపణ చెప్పం ..కేసీఆర్ లీగల్ నోటీసుకు దీటుగా రిప్లై ఇచ్చిన ‘వీ6 వెలుగు’
  • స్పష్టమైన సమాచారం, ఆధారాలతోనే ‘కొండపోచమ్మ’పై కథనం రాసినట్లు క్లారిటీ
  • పరువు నష్టాన్ని రక్షణ కవచంగా వాడుకోవద్దని కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రస్తావన
  • కథనాన్ని ఉపసంహరించుకునే  ప్రసక్తే లేదని.. చట్టపరంగా ఎదుర్కొంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ‘ కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లిన కొండపోచమ్మ!’ శీర్షికతో అక్టోబర్ 17న  వెలుగు దినపత్రికలో ప్రచురించిన గ్రౌండ్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తరపున పంపిన లీగల్ నోటీసుకు విల్ మీడియా తరుపున  వీ6, వెలుగు  దీటుగా రిప్లై ఇచ్చాయి. ‘చంద్ర అండ్ అసోసియేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు చెందిన సీనియర్ న్యాయవాది ఎ.చంద్రశేఖర్ ద్వారా రిప్లై నోటీసు పంపాయి. కేసీఆర్ తరపున పంపిన నోటీసులో వీ6 -వెలుగు మీద  ఏకపక్షంగా చేసిన అభియోగాలు, డిమాండ్లను తోసిపుచ్చాయి. పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే బెదిరింపు ధోరణితో ఈ నోటీసులు పంపారని పేర్కొన్నాయి.   


రూ.100 కోట్ల నష్టపరిహారం డిమాండ్​


అక్టోబర్ 18 తేదీతో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది సోమ భరత్ కుమార్ పేరుతో పంపిన నోటీసు ‘వీ6- వెలుగు’కు అక్టోబర్ 21న అందింది. అందులో తమకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని,  కథనాన్ని వెంటనే ఉపసంహరించుకొని, అన్ని ప్లాట్ ఫాంల నుంచి తొలగించాలని, కథనం సోర్స్ వివరాలు వెల్లడించడంతో పాటు రూ.100 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని లీగల్​ నోటీసులో పేర్కొన్నారు.లేదంటే బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు  చేస్తామని, డ్రోన్ రూల్స్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


అన్ని ఆధారాలతో రిప్లై


కేసీఆర్ తరపు నోటీసుకు ‘వీ6-వెలుగు’ వివరంగా సూటిగా రిప్లై పంపించింది. నిర్ధారణ చేసుకున్న జియోగ్రాఫికల్ సమాచారం, శాటిలైట్ ఇమేజెస్, ఏటేటా ఎర్రవల్లి ప్రాంతంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వ పత్రాలు, క్షేత్రస్థాయి పరిశీలన, సాగునీటి పంపిణీ వివరాలు, స్థానికుల ఫిర్యాదులు లాంటివి అన్నీ విశ్లేషించిన తర్వాతే కథనం వేసినట్లు స్పష్టంచేసింది. కథనంలో లేని విషయాలను వక్రీకరించి బీఆర్ఎస్ నోటీసులో తప్పదోవ పట్టించేలా ప్రస్తావించారని పేర్కొంది. కథనంలో ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని, ప్రజాధనం దుర్వినియోగం, రైతులపై పడుతున్న ప్రభావం లాంటి అంశాలనే లేవనెత్తామని వెల్లడించింది. 


పరువునష్టం రక్షణ కవచం కాదు.. 


దాదాపు రూ. లక్ష కోట్ల జనం సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్. దీనికి సంబంధించిన కెనాల్​ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, జీవోలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ప్రజాధనం ఖర్చు చేసిన తీరు ఇవన్నీ ప్రజాప్రయోజనంలో భాగమైన అంశాలని ‘వీ6-వెలుగు’  రిప్లైలో గుర్తుచేసింది.  బాధ్యత కలిగిన పదవుల్లో ఉండేవారు తప్పనిసరిగా ప్రజల పరిశీలనలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక కథనం వ్యక్తిగతంగా నచ్చలేదన్న కారణంతో ప్రజాజీవితంలో ఉన్నవారు పరువునష్టాన్ని చట్ట బద్ధమైన రక్షణ కవచంగా వాడుకోలేరని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను వీ6 వెలుగు తన రిప్లయ్ లో గుర్తుచేసింది. కథనం వేయడానికి ముందే కొండపోచమ్మ ప్రాజెక్టు నీటి మళ్లింపుపై సీఎం స్వయంగా చెప్పిన విషయాన్ని రిప్లైలో ప్రస్తావించింది. అక్రమ ప్రవేశం, గోప్యత నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసీఆర్ తరపున చేసిన ఆరోపణలను ‘వీ6-వెలుగు’  ఖండించింది. ఫోటోలు, వీడియోలు, ఇతర ఫుటేజీ అన్నీ చట్టబద్ధంగా, మీడియాకు చట్టపరంగా అందుబాటులో ఉన్నవి, బహిరంగంగా లభించే శాటిలైట్ డేటా నుంచే తీసుకున్నామని తెలిపింది. కథనంలో ఎవరి వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించలేదని , ప్రజాధనం వినియోగంపై కథనాలను అడ్డుకోవడానికి గోప్యత హక్కును వాడుకోలేరని స్పష్టం చేసింది.


ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు


మాజీ సీఎం కేసీఆర్ తరపున నోటీసులోని ప్రతి డిమాండ్‌‌‌‌‌‌‌‌ను ‘వీ6 వెలుగు’ తిరస్కరించింది. క్షమాపణ చెప్పడం, కథనం తొలగించడం, సోర్సులను వెల్లడించాల్సిన అవసరం చట్టపరంగా లేదని తేల్చిచెప్పింది. స్వతంత్రంగా పనిచేసే మీడియా సంస్థను భయపెట్టే వ్యూహంతోనే 100 కోట్ల దావా, క్రిమినల్ కేసులంటూ బెదిరిస్తున్నారని రిప్లైలో ప్రస్తావించింది. ప్రజాధనం వినియోగంపై ఎవరి గురించి కథనం రాస్తున్నామో వారి ఆమోదం మీద పరిశోధనాత్మక జర్నలిజం ఉండదని స్పష్టంచేసింది. తెలంగాణ ఉద్యమంలో ‘వీ6’ పోషించిన పాత్రను, దానిని కేసీఆర్ స్వయంగా పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రశంసించిన విషయాన్ని రిప్లైలో గుర్తుచేసింది.

చట్టపరంగానే ఎదుర్కొంటాం

నిరాధారంగా బీఆర్ఎస్ వేధింపు చర్యలకు దిగితే, చట్టపరంగా కోర్టులో ఎదుర్కోవడానికి నిజాలతో, ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని  వీ6-వెలుగు  స్పష్టంచేసింది. ప్రజా ప్రాధాన్య అంశాలపై చట్టాలు, నైతిక విలువలకు కట్టుబడి జర్నలిజం కొనసాగిస్తామని తెలిపింది. నోటీసులతో బెదిరించే పనులు ఆపాలని తమ క్లయింట్‌‌‌‌‌‌‌‌కు చెప్పాలని బీఆర్ఎస్ లీగల్ సెల్‌‌‌‌‌‌‌‌కు సూచించింది. రిప్లై నోటీసు జారీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. నిజాయతీ జర్నలిజానికి కట్టుబడి ఉన్నామని, కథనంలోని ఏదయినా అంశం గురించి భిన్నమైన అధికారిక రికార్డులుగానీ, టెక్నికల్ రిపోర్టులుగానీ ఉంటే పంపించాలని ‘వీ6-వెలుగు’ సూచించింది. అట్లాంటి సమాచారం పంపిస్తే పరిశీలిస్తామని తెలిపింది.