ఖాళీలు వేలల్లో.. నింపేది వందల్లో

ఖాళీలు వేలల్లో.. నింపేది వందల్లో

సింగరేణి కీలక క్యాటగిరిల్లో 2వేలకు పైగా ఖాళీలు

ఐదేండ్లుగా ఊసేలేని జూనియర్ మైనింగ్ పోస్టులు
తాజాగా 651 జాబ్ లు భర్తీ చేస్తామన్న యాజమాన్యం
నిరుద్యోగుల్లో నిరాశ

మందమర్రి, వెలుగు:  సింగరేణిలో ఆరేళ్ల తర్వాత కొలువుల భర్తీకి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్చిలోపు 651 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సింగరేణి ప్రకటించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న​అన్​ఎంప్లాయీస్, ఇంటర్నల్ ఎంప్లాయీస్ కు  సింగరేణి ప్రకటన కాస్త ఊరటనిచ్చినా  పూర్తిస్థాయిలో పోస్టులను  భర్తీ చేయకపోవడం నిరాశకు గురిచేస్తోంది.  సింగరేణివ్యాప్తంగా వివిధ కేటగిరిల్లో సుమారు 2 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా కార్మికుల సంఖ్య తగ్గిపోతుండగా.. సీనియర్లు, అనుభవజ్ఞులైన కార్మికులు దూరమవుతున్నారు. దీంతో కీలకమైన కేటగిరిల్లో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కీలకమైన సేఫ్టీ బాధ్యతలు నిర్వహించే  మైనింగ్ సూపర్​వైజర్స్​ కొరత వందల సంఖ్యలో ఉంది.  తాజాగా ప్రకటించిన పోస్టుల్లో  మైనింగ్​సిబ్బంది ఎంపిక ఊసే లేదు. మరోవైపు సింగరేణిలో సుమారు 700 మంది జూనియర్​ అసిస్టెంట్(క్లర్కు) పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 354  మందిని భర్తీ చేస్తామని ప్రకటించింది. ఉన్నత చదువులు చదివిన వందలాది  ఇంటర్నల్​ ఎంప్లాయీస్​ యాక్టింగ్​ క్లర్కులుగా కొనసాగుతున్నారు. కేవలం 177 మందికే అవకాశం కల్పించడంతో  మిగిలినవారు రెగ్యులర్​అయ్యే పరిస్థితి లేకుండా పోతోంది.

వందల ఖాళీలున్నా..

గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, సేఫ్టీ పూర్తిగా మైనింగ్​సూపర్​వైజర్స్​పైనే ఉంటుంది.  సింగరేణి వ్యాప్తంగా 26 అండర్​గ్రౌండ్​ మైన్లు, 19 ఓసీపీలున్నాయి. గనుల్లో ఒక్కో పని స్థలానికి ఒక్కో మైనింగ్​సూపర్​వైజర్​తప్పనిసరి. షార్ట్​ఫైరర్, సర్దార్, ఓవర్మెన్​లుంటేనే అక్కడ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో గనిలో షిఫ్టుకు కనీసం 10 మంది ఓవర్​మెన్​లు, 20 మంది సూపర్​వైజర్ల అవసరముంటుంది. ఇలా రోజుకు మూడు షిఫ్టుల్లో ఉంటారు. వీరు కార్మికులతో పనులు చేయించడంతో పాటు పనిస్థలంలో ఉత్పత్తి ఎంత వస్తుంది, సేఫ్టీ చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్న విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఓవర్​మెన్​రెండు నుంచి మూడు పని స్థలాలను పర్యవేక్షిస్తారు. సర్దార్లు ఒక పనిస్థలంలో సూపర్​వైజర్​లుగా పనిచేస్తే వారికి అసిస్టెంట్లుగా షార్ట్​ఫైరర్​లు ఉంటారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు 3 వేల మంది మైనింగ్​సూపర్​వైజర్స్​అవసరముంది. అయితే ఎంప్లాయీస్​ ప్రతి ఏటా రిటైర్​ అవుతుండడంతో ప్రస్తుతం వీరి సంఖ్య 900కు పరిమితమైంది.  వీరికి తోడు మరో 650 మంది జేఎంఈటీలు ఉన్నారు. సరైన సూపర్​వైజింగ్​ లేక తరచూ ప్రమాదాలు జరిగి విలువైన కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. ఆరేళ్ల కిందట 650 మంది జేఎంఈటీ(మైనింగ్​)లను నియమించిన యాజమాన్యం ఇప్పటివరకు మళ్లీ ఎంపిక చేయలేదు. సింగరేణివ్యాప్తంగా సుమారు 1,400 మంది మైనింగ్​ సూపర్​వైజర్ల కొరత ఉంది. తాజా పోస్టుల్లో ఆఫీసర్​ లెవల్​లో మాత్రం మైనింగ్​విభాగం మేనేజ్​మెంట్​ ట్రైనీలో 39 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన క్షేత్రస్థాయి మైనింగ్​ సూపర్​వైజర్ల ఎంపికను ఆఫీసర్లు విస్మరించారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

యాక్టింగ్ ​క్లర్కులకు అవకాశమేదీ!

సింగరేణి వ్యాప్తంగా మైన్స్, ఓసీపీలు, డిపార్ట్​మెంట్లలో  క్లర్క్ లు సుమారు 1,600 మంది సేవలందిస్తున్నారు. మ్యాన్​వే, వేబ్రిడ్జి, పే షీట్, వెల్ఫేర్, స్టోర్స్, బిల్స్, పర్చేజ్, ఆర్డర్స్, కో ఆర్డినేషన్స్, సెటిల్​మెంట్లు, ఆడిట్, జీతభత్యాలు, ప్రమోషన్లు, సర్వీస్​తదితర రంగాల్లో వీరు పనిచేస్తుంటారు. ఒక్కోచోట ఈ పనులన్నీ ఇద్దరు లేక ముగ్గురు చేయాల్సి ఉంది. కాని యాజమాన్యం ఒక్కరితోనే నెట్టుకొస్తోంది. ప్రతి వెయ్యి మందికి సంబంధించిన పనులన్నీ కంప్యూటర్​ద్వారా ఒక క్లర్కే చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సుమారు 700 మంది వరకు క్లర్కుల కొరత ఉంది.  ఉన్నత చదువులు చదివిన బదిలీ వర్కర్లు,  జనరల్​ మజ్దూర్​కార్మికులతో పనులు చేయించుకుంటున్నారు.  ఇలా సంవత్సరాల తరబడి సింగరేణిలో సుమారు 1000 మందికిపైగా  యాక్టింగ్​ క్లర్కులుగా పనిచేస్తున్నారు.  తాజాగా 177 మంది బయటి అభ్యర్థులకు, మరో 177 మంది ఇంటర్నల్​ ఎంప్లాయీస్​కు జూనియర్​అసిస్టెంట్లుగా అవకాశం కల్పిస్తామని కంపెనీ ప్రకటించింది. ఇన్నాళ్లుగా యాక్టింగ్​ క్లర్కులుగా కొనసాగుతున్న యువ ఉద్యోగులు దీంతో నిరాశ చెందుతున్నారు. ఐదేళ్లలో కారుణ్య నియామకాల ద్వారా సుమారు 7 వేల మంది, నేరుగా 3,230 మంది యువకులు సింగరేణిలో చేరారు. మొత్తంగా యువ ఉద్యోగుల సంఖ్య 8 వేలకు పైగా ఉంటుంది. వీరిలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఐటీఐ చదివినవారు దాదాపు 3 వేల మందికి పైగా ఉన్నారు.  ఐఈడీ రూల్​ప్రకారం క్లర్క్​లను నియమించే క్రమంలో జనరల్​ మజ్దూర్లను ఇంటర్నల్​ నోటిఫికేషన్​ ద్వారా తీసుకుంటే చాలా పనిభారం తగ్గే అవకాశాలున్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు ఎలక్ర్టీషీయన్, ఫిట్టర్, వెల్డర్​విభాగాల్లో వందల సంఖ్యలో  ఖాళీలున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ద్వారా ఇంటర్నల్​ ఎంప్లాయీస్​ను  ఎంపిక చేసి ఖాళీలను భర్తీ చేయాలనే డిమాండ్​ కార్మిక సంఘాల నుంచి వస్తోంది.