
- పీడీ, పీఈటీలనూ నింపని సర్కారు
- ఔట్ సోర్సింగ్ సిబ్బందితో క్లాసులు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించిన మోడల్ స్కూళ్లలో టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ ఐదేళ్లుగా నిలిచిపోయింది. నాన్‌టీచింగ్ విభాగంలోనూ ఇప్పటికీ పర్మినెంట్ సిబ్బందిని నియమించలేదు. పీడీ, పీఈటీలనూ రిక్రూట్ చేయలేదు. దీంతో తాత్కాలిక ఉద్యోగులతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి.
స్టేట్‌లో194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో లక్షా30 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కేంద్రం సహకారంతో వీటిని 2013–-14లో ప్రారంభించారు. మొదట్లో వీటి నిర్వహణ ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాయి. రెండేళ్ల నుంచి కేంద్రం నిధులు ఆపేసింది. దీంతో ఆ భారం స్టేట్ గవర్నమెంట్‌పై పడింది. 2013లో కొన్ని టీచింగ్ పోస్టులను, 2014లో మరికొన్నింటినీ రిక్రూట్ చేశారు. ఆ తర్వాత కొన్ని స్కూల్స్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయినా పోస్టులను భర్తీ చేయలేదు. స్టేట్‌లో 194 మోడల్ స్కూల్స్‌లో మొత్తం 3,880 శాంక్షన్డ్ టీచింగ్ పోస్టులుంటే అందులో 2,872 మందే పనిచేస్తున్నారు. మరో 1,008 ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపాల్స్ పోస్టులు 88 ఖాళీ ఉండగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 528, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)లు 392 ఖాళీగా ఉన్నాయి. ఇవీ కాకుండా మరో 500 వరకూ సిబ్బంది అవసరమని అధికారులు చెబుతున్నారు. ఐదేండ్ల నుంచి కొత్తగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో తాత్కాలిక సిబ్బందితో లెసన్స్ చెప్పిస్తున్నారు.
నాన్ టీచింగ్.. ఔట్ సోర్సింగ్
ఇక నాన్ టీచింగ్ పోస్టుల్లో ఒక్కరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయ్ లేరు. కనీసం పిల్లల్ని ఆడించేందుకు పీడీ, పీఈటీ పోస్టులనూ భర్తీ చేయలేదు. స్కూల్స్‌లో డాటాఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ సబార్డినేట్, నైట్‌వాచ్‌మెన్ పోస్టులూ ఔట్‌సోర్సింగే. స్టేట్‌లో 776 నాన్ టీచింగ్ పోస్టులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కొన్ని మోడల్ స్కూల్స్‌లో హాస్టల్స్ ప్రారంభించారు. ఆ బాధ్యతల్ని ప్రిన్సిపల్స్ చేస్తున్నారు. హాస్టల్స్ పర్యవేక్షణకు వార్డెన్స్‌ను రిక్రూట్ చేయాల్సి ఉంది.