గుడ్ న్యూస్: 15 రోజుల్లో 4 వేల పోస్టులకు నోటిఫికేషన్

గుడ్ న్యూస్: 15 రోజుల్లో 4 వేల పోస్టులకు నోటిఫికేషన్
  • గడిచిన 8 నెలల్లో 7,038 పోస్టుల భర్తీ
  • రిక్రూట్‌‌మెంట్ దశలో మరో 6,293 పోస్టులు
  • 10 రోజుల్లో మరో 612 పోస్టులకు నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి. ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం వరుసగా భర్తీ చేస్తోంది. గడిచిన 15 రోజుల్లోనే 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో 1,600 మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్‌‌) పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తామని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

8 నెలల్లో 7,308 పోస్టుల భర్తీ 

కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, హాస్పిటళ్ల అప్‌‌గ్రెడెషన్‌‌తో ప్రభుత్వ దవాఖాన్లలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టులు అన్నీ భర్తీ చేసి, వైద్య సేవలు మెరుగుపరుస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఇదివరకే ప్రకటించారు. కోర్టు కేసులతో ఆగిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్లపై కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే మంత్రి దృష్టి సారించారు. ప్రతి దవాఖానలో కనీసం 80 శాతం పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017, 2018 నుంచి ఆగిపోయిన ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్, ఇతర కేసులకు కోర్టులో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. నర్సింగ్ ఆఫీసర్ల నియామక ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందికి అపాయింట్‌‌మెంట్ లెటర్లు ఇచ్చారు. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లను, 48 మంది ఫిజియోథెరపిస్టులను, 18 మంది డ్రగ్‌‌ ఇన్‌‌స్పెక్టర్లను రిక్రూట్ చేశారు. మొత్తంగా ఇప్పటివరకూ 8 నెలల్లో 7,308 పోస్టులను భర్తీ చేశారు. 

మెడికల్ రిక్రూట్​మెంట్​ బోర్డు స్పీడు..

ఈ నెల11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, ఈ నెల 17న మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన వచ్చింది. రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితో పాటు 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్), 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు సైతం రిక్రూట్‌‌మెంట్ దశలో ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం 6,293 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే 643 మంది టీచింగ్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్ చేశారు. ఇవిగాక మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ బేసిస్‌‌లో భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరో పది రోజుల్లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.