టీకాలు వేస్కోవడమే నిజమైన దేశభక్తి

టీకాలు వేస్కోవడమే నిజమైన దేశభక్తి
  • కరోనా నుంచి స్వతంత్రానికి చేరువైనం 
  • మళ్లీ మామూలు స్థితికి తిరిగి వస్తున్నం 
  • అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా బైడెన్

వాషింగ్టన్: ‘‘కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడమే మీరు చూపించగల నిజమైన దేశభక్తి” అని అమెరికన్లకు ప్రెసిడెంట్ జో బైడెన్ పిలుపునిచ్చారు. ఏడాదికిపైగా కరోనా మహమ్మారిపై కలసికట్టుగా పోరాడామని, తిరిగి మామూలు స్థితికి వస్తున్నామని అన్నారు. దేశం కరోనా నుంచి స్వతంత్రానికి చేరువైందని ప్రకటించారు. ఆదివారం అమెరికా 245వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైట్ హౌస్ లాన్ లో వెయ్యి మంది గెస్టులకు బైడెన్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఈ ఏడాది జులై 4 మనకు స్పెషల్ డే. కరోనా వల్ల ఏడాదికిపైగా చీకట్లో మగ్గిన మనం తిరిగి వెలుగులోకి వస్తున్నం. ఏడాది ఎన్నో బాధలు, భయాలు, దుఃఖాల తర్వాత మనం కలసికట్టుగా తిరిగి మామూలు స్థితికి వస్తున్నాం” అని బైడెన్ చెప్పారు. అయితే కరోనాపై పోరు ఇంతటితో ముగిసిపోలేదని, మనం చేయాల్సిన పోరాటం ఇంకా చాలా ఉందని హెచ్చరించారు. వైరస్ నుంచి స్వతంత్రం లభించిందన్న దానికి సూచనగా దేశవ్యాప్తంగా ఆదివారం టపాసులతో సంబరాలు జరుపుకొన్నారు. జులై 4 నాటికి 70 శాతం మందికి వ్యాక్సిన్ లు వేయాలని టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటివరకు 67 శాతం మందికి టీకాలు వేశారు.