దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించింది. జూన్ 19న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గురువారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో వడ్డే నవీన్ మాట్లాడుతూ ‘నాకు నచ్చిన కథలు రాకపోవడంతోనే గ్యాప్ తీసుకున్నా. కమల్ చెప్పిన కంటెంట్ చాలా కొత్తగా ఉంటుంది.
కానిస్టేబుల్‌గా నా పాత్రలోనూ కొత్తదనం కనిపిస్తుంది. హై క్వాలిటీ స్టాండర్డ్‌లో సినిమా చేశాం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నారు. ఈ చిత్రంలో లక్ష్మి పాత్ర పోషించానని రాశీ సింగ్ చెప్పింది. దర్శకుడు కమల్ తేజ నార్ల మాట్లాడుతూ ‘ఏడాదిన్నర పాటు ఈ స్క్రిప్ట్ మీద పని చేశాం. నా డెబ్యూ మూవీ ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు.
పూరి జగన్నాథ్ గారి వద్ద పని చేసినప్పుడు ఇలాంటి ఓ మూమెంట్ కోసం చూశాను. వడ్డే నవీన్ గారికి ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుంది’ అని అన్నాడు. నటులు వడ్లమాని శ్రీనివాస్, సాయి కిరణ్, సాత్విక్, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
