- 19 బాల్స్‌లోనే 63 రన్స్ కొట్టిన 14 ఏండ్ల వైభవ్
- డీవై పాటిల్ టీ20 కప్‌లో విధ్వంసం
ముంబై: ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు యంగ్ సెన్సేషన్, రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపాడు. డీవై పాటిల్ టీ20 కప్‌లో 14 ఏండ్ల వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇండియన్ నేవీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో డీవై పాటిల్ బ్లూ జట్టు తరఫున బరిలోకి దిగిన అతను 19 బాల్స్‌లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 రన్స్ కొట్టి ఔరా అనిపించాడు. తన స్ట్రయిక్ రేట్ 331.58 కావడం విశేషం. ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్లతోనే 58 రన్స్ రాబట్టిన అతను 14 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వైభవ్‌తో పాటు అర్జున్ టెండూల్కర్ (29 బాల్స్‌లో 55 నాటౌట్) మెరుపు ఫిఫ్టీతో నేవీ ఇచ్చిన 221 రన్స్ టార్గెట్‌ను బ్లూ టీమ్ 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ఇటీవల అండర్–19 వరల్డ్ కప్ ఫైనల్లో భారీ సెంచరీతో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన సూర్యవంశీపై రాబోయే ఐపీఎల్‌లో భారీ అంచనాలున్నాయి. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన 14 ఏండ్ల వైభవ్‌ను రాజస్తాన్ రిటైన్ చేసుకుంది.
