IND VS ENG: 14 ఏళ్లకే ఆల్‌టైం రికార్డ్ బద్దలు: ఇంగ్లాండ్‌ను చితక్కొట్టిన సూర్యవంశీ.. 52 బంతుల్లోనే సెంచరీ

IND VS ENG: 14 ఏళ్లకే ఆల్‌టైం రికార్డ్ బద్దలు: ఇంగ్లాండ్‌ను చితక్కొట్టిన సూర్యవంశీ.. 52 బంతుల్లోనే సెంచరీ

ఇంగ్లాండ్ అండర్19 తో జరుగుతున్న యూత్ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డేలో చెలరేగి ఆడాడు. ఆడుతుంది వన్డే అయినప్పటికీ.. టీ20 తరహాలో చెలరేగిపోయాడు. శనివారం (జూలై 5) వొర్సెస్టర్‌లో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొడుతూ కేవలం 52 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. 19వ ఓవర్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ రాల్ఫీ ఆల్బర్ట్ బౌలింగ్‌లో సింగిల్ తో సెంచరీ మార్క్ అందుకున్నాడు.  

ALSO READ | IND VS ENG 2025: రాహుల్ హాఫ్ సెంచరీ.. పంత్ మెరుపులు: 350 పరుగులు దాటిన టీమిండియా ఆధిక్యం

ఓవరాల్ గా సూర్యవంశీ 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తో సూర్యవంశీ మెన్స్ యూత్   వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ ఆటగాడు కమ్రాన్ గులాం 53 బంతుల్లో చేసిన  సెంచరీని సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఆరంభం నుంచి వైభవ్.. దూకుడుగా ఆడాడు. ఈ 14 ఏళ్ళ కుర్రాడిని ఆపడానికి ఇంగ్లాండ్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ సిరీస్ లో అంతకముందు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఈ బీహార్ చిచ్చర పిడుగు నేడు ఏకంగా సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా అండర్ 19 ప్రస్తుతం 31 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. సూర్యవంశీ (143) రికార్డ్ సెంచరీకి తోడు విహాన్ మల్హోత్రా (63) హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. ఆయుష్ మాత్రే 5 పరుగులే చేసి ఔటయ్యాడు.