IND VS ENG 2025: రాహుల్ హాఫ్ సెంచరీ.. పంత్ మెరుపులు: 350 పరుగులు దాటిన టీమిండియా ఆధిక్యం

IND VS ENG 2025: రాహుల్ హాఫ్ సెంచరీ.. పంత్ మెరుపులు: 350 పరుగులు దాటిన టీమిండియా ఆధిక్యం

ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. నాలుగో రోజు తొలి సెషన్ లో దూకుడు చూపించింది. తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయినా కీలకమైన 100 పరుగులను రాబట్టింది. రాహుల్ హాఫ్ సెంచరీకి తోడు పంత్ మెరుపులు మెరిపించడంతో నాలుగో రోజు లంచ్ సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యం 357 పరుగులకు చేరింది. క్రీజ్ లో గిల్ (24), పంత్ (41) ఉన్నారు. రెండో సెషన్ లో భారత్ వేగంగా ఆడితే ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. 

వికెట్ నష్టానికి 64 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా కాసేపటికే కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయింది. కార్స్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి కరుణ్ దొరికిపోయాడు. ఈ దశలో గిల్, రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 30 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత రాహుల్ 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. టంగ్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డయ్యాడు. 

ALSO READ : చివరి టెస్ట్ ఆడేశాడా: రీ ఎంట్రీలోనూ ఘోరంగా.. ప్రమాదంలో కరుణ్ టెస్ట్ కెరీర్

గిల్ తో జత కలిసిన పంత్ వచ్చి రావడంతోనే ఎటాకింగ్ గేమ్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగుతూ బౌండరీల వర్షం కురిపించాడు. మరో ఎండ్ లో గిల్ సింగిల్స్ తీస్తూ పంత్ కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 53 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు జోడించి లంచ్ కు వెళ్లారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ రెండు.. కార్స్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 407 పరుగులు చేసింది.