రాజస్తాన్‌‌ వైభవం..7 వికెట్ల తేడాతో లక్నోపై గ్రాండ్‌‌ విక్టరీ

రాజస్తాన్‌‌ వైభవం..7 వికెట్ల తేడాతో లక్నోపై గ్రాండ్‌‌ విక్టరీ
  • సూర్యవంశీ, జురెల్‌‌ ఫోర్లు, సిక్సర్ల జాతర
  • మార్ష్‌‌, ఇంగ్లిస్‌‌ మెరుపులు వృథా

రాజస్తాన్‌‌ రాయల్స్‌‌.. ప్లే ఆఫ్స్‌‌ దిశగా మరో అడుగు బలంగా వేసింది. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో భారీ టార్గెట్‌‌ ఛేదిస్తూ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. ఫస్ట్​బ్యాటింగ్​చేసిన లక్నో 20 ఓవర్లలో 220/5 స్కోరు చేయగా.. రాజస్తాన్‌‌ 19.1 ఓవర్లలో 225/3 స్కోరు చేసి విజయం సాధించింది.

జైపూర్‌‌: ఐపీఎల్‌‌–19లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌.. ప్లే ఆఫ్స్‌‌ దిశగా మరో అడుగు బలంగా వేసింది. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో వైభవ్‌‌ సూర్యవంశీ (38 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 10 సిక్స్‌‌లతో 93) పరుగుల సునామీ సృష్టించడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో రాయల్స్‌‌ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. టాస్‌‌ ఓడిన లక్నో 20 ఓవర్లలో 220/5 స్కోరు చేసింది. మిచెల్‌‌ మార్ష్‌‌ (57 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 96), జోస్‌‌ ఇంగ్లిస్‌‌ (29 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 60) దంచికొట్టారు. తర్వాత రాజస్తాన్‌‌ 19.1 ఓవర్లలో 225/3 స్కోరు చేసి నెగ్గింది. ధ్రువ్‌‌ జురెల్‌‌ (38 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 53 నాటౌట్‌‌) యశస్వి జైస్వాల్‌‌ (43) చెలరేగారు. వైభవ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

సెంచరీ భాగస్వామ్యం..

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై లక్నో ఓపెనర్లు మార్ష్‌‌, ఇంగ్లిస్‌‌ చెలరేగిపోయారు. మార్ష్‌‌ 4, 6తో ఖాతా తెరిస్తే, రెండో ఓవర్‌‌లో ఇంగ్లిస్‌‌ దాన్ని రిపీట్‌‌ చేశాడు. తర్వాత ఓ బౌండ్రీ కొట్టిన ఇంగ్లిస్‌‌ నాలుగో ఓవర్‌‌లో 4, 4, 6 దంచాడు. ఐదో ఓవర్‌‌లో మార్ష్‌‌ 4, 4, 6తో పునరావృతం చేశాడు. ఆరో ఓవర్‌‌లో ఇంగ్లిస్‌‌ 6, 4తో పవర్‌‌ప్లేలో లక్నో 83/0 స్కోరు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లిస్‌‌ 23 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేశాడు. తర్వాతి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌‌లు కొట్టిన మార్ష్‌‌ వంద పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు.

 9వ ఓవర్‌‌లో ఫోర్‌‌ కొట్టిన ఇంగ్లిస్‌‌ను యష్‌‌ రాజ్‌‌ పూనియా (2/35) ఔట్‌‌ చేశాడు. ఫలితంగా తొలి వికెట్‌‌కు 109 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. నికోలస్‌‌ పూరన్‌‌ (16) రెండు సిక్స్‌‌లతో టచ్‌‌లోకి రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో లక్నో 127/1 స్కోరు చేసింది. ఆ వెంటనే మార్ష్‌‌ 25 బాల్స్‌‌లో హాఫ్‌‌ మార్క్‌‌ అందుకున్నాడు. 12వ ఓవర్‌‌లో మార్ష్‌‌ మూడు ఫోర్లు బాదినా.. 13వ ఓవర్‌‌లో పూనియా.. పూరన్‌‌ను పెవిలియన్‌‌కు పంపాడు. రెండో వికెట్‌‌కు 42 రన్స్‌‌ జతయ్యాయి. 

రిషబ్‌‌ పంత్‌‌ (35) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయడంతో 15 ఓవర్లలో స్కోరు 165/2కు పెరిగింది. 16వ ఓవర్‌‌లో సిక్స్‌‌తో పంత్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించగా.. మార్ష్‌‌ దంచుడు మాత్రం ఆగలేదు.   పంత్‌‌ 4, 4, 6, ఆ తర్వాత  మార్ష్‌‌ 4, 6, 4, 4 కొట్టి ఇద్దరూ ఆఖరి ఓవర్‌‌లోనే రనౌటయ్యారు. మూడో వికెట్‌‌కు 64 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఆఖరి బాల్‌‌కు ఆయుష్‌‌ బదోనీ (0) క్లీన్‌‌బౌల్డ్‌‌ అయినా లక్నో భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

బౌండ్రీల మోత..

 తొలి ఓవర్‌‌ నుంచే యశస్వి జైస్వాల్​ నాలుగు ఫోర్లతో ఛేజింగ్‌‌ను మొదలుపెట్టాడు. నాలుగో ఓవర్‌‌లోనూ జైస్వాల్​ 6, 4, 4, 4తో 19 రన్స్‌‌ దంచాడు. తర్వాత వైభవ్‌‌ 6, 6, 4, 4తో పవర్‌‌ప్లేలో రాయల్స్‌‌ 71/0 స్కోరు చేసింది. మంచి జోరుమీదున్న జైస్వాల్‌‌ను ఏడో ఓవర్‌‌లో అకాశ్‌‌ సింగ్‌‌ (1/54) ఔట్‌‌ చేశాడు. దాంతో తొలి వికెట్‌‌కు 75 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ధ్రువ్‌‌ జురెల్‌‌ రెండు ఫోర్లతో టచ్‌‌లోకి రాగా, 9వ ఓవర్‌‌లో సూర్యవంశీ 6, 4, 4, 6, 4తో 23 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు.

 తర్వాతి మరో సిక్స్‌‌తో తొలి 10 ఓవర్లలో రాజస్తాన్‌‌ 121/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. 11వ ఓవర్‌‌లో సూర్యవంశీ మరో రెండు సిక్స్‌‌లు కొట్టాడు. మయాంక్‌‌ వేసిన12వ  ఓవర్‌‌లో జురెల్‌‌ 4, 6, 6.. సూర్యవంశీ 6, 6తో 29 రన్స్‌‌ బాదడంతో మ్యాచ్‌‌ రాయల్స్‌‌ వైపు టర్న్‌‌ తీసుకుంది. స్పిన్నర్‌‌ దిగ్వేష్‌‌ రాఠీ  వేసిన 13వ ఓవర్‌‌లో 6, 4 సూర్యవంశీని తర్వాతి ఓవర్‌‌లో మోషిన్‌‌ ఖాన్‌‌ (1/31) ఔట్‌‌ చేశాడు. ఇదే ఓవర్‌‌లో జురెల్‌‌ రనౌట్‌‌ను పంత్‌‌ మిస్‌‌ చేశాడు. రెండో వికెట్‌‌కు 105 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 15 ఓవర్లలో స్కోరు 188/2కు చేరింది. చివర్లో ప్రిటోరియస్‌‌ (7) రనౌటైనా.. జురెల్‌‌ 37 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఫెరీరా (16 నాటౌట్‌‌)తో కలిసి ఈజీగా విజయాన్ని అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 220/5 (మార్ష్‌‌ 96, ఇంగ్లిస్‌‌ 60, పూనియా 2/35). రాజస్తాన్‌‌: 19.1 ఓవర్లలో 225/3 (సూర్యవంశీ 93, జురెల్‌‌ 43*, మోషిన్‌‌ ఖాన్‌‌ 1/31).