కొండగట్టులో ఘనంగా వైకుంఠ ఏకాదశి

కొండగట్టులో ఘనంగా వైకుంఠ ఏకాదశి

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుదీరారు. ఆలయంలోని శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను గరుడ వాహనం పైన అధిష్టింపజేసి, అలంకరించిన అనంతరం ఉత్తర ద్వారం ఎదురుగా ప్రత్యేక మండపంలో పంచామృతాభిషేకం, తులసీదళ నామార్చన, పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. 

సుమారు 20 వేల మంది భక్తులు కొండగట్టుకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆఫీసర్లు తెలిపారు. భక్తుల రద్దీతో ఆలయపరిసరాలు కిటకిటలాడాయి. మంగళవారం తెల్లవారుజామునే కలెక్టర్‌‌ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్‌‌ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొండగట్టుకు రూ. 10 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.