విలువల కోసం పదవులు వదిలేసిన గొప్ప నేత వాజ్పేయి: బండి సంజయ్

విలువల కోసం పదవులు వదిలేసిన గొప్ప నేత వాజ్పేయి: బండి సంజయ్
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
  • ఢిల్లీలో వాజ్ పేయి సమాధి వద్ద నివాళులు

న్యూఢిల్లీ, వెలుగు: నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి వంటి అత్యున్నత పదవులను తృణప్రాయంగా వదిలేసుకున్న గొప్ప నాయకుడు వాజ్‌పేయి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రెండు ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకురావడంతో పాటు మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన మహానేత అని పేర్కొన్నారు.
 ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేదవాడి వరకు తీసుకెళ్లాలనే శ్యాం ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేశారని కొనియాడారు. బుధవారం వాజ్​పేయి వర్ధంతి సందర్భంగా బీజేపీ చీఫ్ నడ్డా, ఇతర ముఖ్య నేతలతో కలిసి బుధవారం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద సంజయ్ పుష్పాంజలి ఘటించారు. 
స్వార్థ ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలతో ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న ప్రస్తుత ప్రతిపక్షాలకు భిన్నంగా.. ఆనాడు ప్రతిపక్షంలో వాజ్ పేయి వ్యవహరించారని సంజయ్​ పేర్కొన్నారు.