బీసీలకు కేంద్రంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి: వకుళాభరణం కృష్ణ మోహన్ 

బీసీలకు కేంద్రంలో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి: వకుళాభరణం కృష్ణ మోహన్ 

కేంద్ర ప్రభుత్వంపై బీసీల ధర్మ పోరాటం మొదలైందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ అన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు కులగణనను  తక్షణమే చేపట్టాలని కోరారు. బీసీలను విస్మరిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. ఈమేరకు డిమాండ్లతో రూపొందించిన ‘బీసీల ధర్మపోరాటం’ పోస్టర్లను  సోమాజీగూడ  ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామితో కలిసి వకుళాభరణం కృష్ణ మోహన్  ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు దేశంలో ఎంతశాతం ఉన్నారో.. అంతే శాతం అధికారంలో వాటాను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని  కోరారు.

తెలంగాణ గడ్డపై నుంచి బీసీల ధర్మ పోరాటం మొదలైందని.. దీనిలో  అన్ని బీసీ కులాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధ సంస్థలో చైర్మన్​ గా ఉన్న తాను బీసీల ధర్మపోరాటంలో ఒక కార్యకర్తను మాత్రమేనని స్పష్టం చేశారు. బీసీ వర్గం నుంచి ప్రధానిగా ఉన్న మోడీ .. బీసీలకు కేవలం రూ.900 కోట్ల బడ్జెట్​ ను మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు, మండల్ కమిషన్​ చెప్పినా కుల గణన చేయడంలో కేంద్రానికి ఉన్న అడ్డంకులు ఏమిటని ప్రశ్నించారు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోతే, కులగణన చేపట్టకపోతే ఇక నుంచి రైతుల పోరాటం లాగే బీసీ ల ధర్మ పోరాటం కూడా కొనసాగుతుందని వకుళాభరణం కృష్ణ మోహన్ తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్,దుర్గారావు,పద్మ, నిర్మల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు