ఫెడరర్​ను వణికించిన సుమిత్ నగల్

ఫెడరర్​ను వణికించిన సుమిత్ నగల్

ఆడుతోంది కెరీర్‌‌లో తొలి గ్రాండ్‌‌స్లామ్‌‌ మ్యాచ్‌‌. ఎదురుగా 20 గ్రాండ్‌‌స్లామ్‌‌ల విజేత రోజర్‌‌ ఫెడరర్‌‌. ప్రత్యర్థి టెన్నిస్‌‌ లెజెండ్‌‌ అయినా.. అతని అనుభవం అంత వయసు కూడా తనకు లేకపోయినా..  ఇండియా యువ ప్లేయర్‌‌ సుమిత్‌‌ నగల్‌‌ బెదరలేదు. మూడు మ్యాచ్‌‌ల క్వాలిఫయింగ్‌‌ రౌండ్‌‌ దాటి యూఎస్‌‌ ఓపెన్‌‌లో తొలిసారి  మెయిన్‌‌ డ్రాకు దూసుకొచ్చిన 24 ఏళ్ల ఈ యువ కెరటం ఫస్ట్‌‌ రౌండ్‌‌లో అసామాన్య పోరాటం చేశాడు. మొదటి సెట్‌‌ గెలిచి ఫెడరర్‌‌నే కాక ఫ్యాన్స్‌‌ను విస్మయానికి గురిచేశాడు..!  చివరకు మేటి ప్లేయర్‌‌ అనుభవం ముందు తలొగ్గినా.. ఏ దశలోనూ పోరాటం ఆపని సుమిత్‌‌  శభాష్‌‌ అనిపించుకున్నాడు..!   కుర్రాడికి మంచి ఫ్యూచర్‌‌ ఉంది అని ఫెడరర్‌‌ నుంచి పొగడ్తలు అందుకున్నాడు..! 

న్యూయార్క్‌‌:  సీజన్‌‌ చివరి గ్రాండ్‌‌స్లామ్‌‌ యూఎస్‌‌ ఓపెన్‌‌లో టాప్‌‌ స్టార్లు శుభారంభం చేశారు.  వరల్డ్‌‌ నంబర్‌‌ వన్​ నొవాక్‌‌ జొకోవిచ్‌‌, మూడో సీడ్‌‌ రోజర్‌‌ ఫెడరర్‌‌, సెరెనా విలియమ్స్‌‌ రెండో రౌండ్‌‌లో అడుగుపెట్టారు.  ఇండియాకు చెందిన సుమిత్‌‌ నగల్‌‌, ప్రజ్నేశ్‌‌ గుణేశ్వరన్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌ దాటలేకపోయారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌లో  టాప్‌‌ సీడ్‌‌ జొకోవిచ్‌‌(సెర్బియా) 6–4, 6–1, 6–4తో రాబర్టో కార్బలైస్‌‌ బెనా(స్పెయిన్‌‌)ను వరుస సెట్లలో చిత్తుగా ఓడించాడు. 23వ సీడ్‌‌ సీడ్‌‌ స్టాన్‌‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌‌) 6–3, 7–6 (7/4), 4–6, 6–3తో జనిక్‌‌ సినర్‌‌ (ఇటలీ)పై  నెగ్గగా, 15వ సీడ్‌‌ డేవిడ్‌‌ గాఫిన్‌‌ (బెల్జియం) 6–3, 3–6, 6–4, 6–0తో కొరెంటిన్‌‌ మౌటెట్‌‌ (ఫ్రాన్స్‌‌)ను ఓడించాడు. ఏడో సీడ్‌‌ నిషికొరి(జపాన్) 6–1, 4–1తో లీడ్‌‌లో ఉన్న టైమ్‌‌లో అర్జెంటీనా క్వాలిఫయర్‌‌ మార్కోట్రన్‌‌గెల్టీ రిటైర్‌‌ అవ్వడంతో రెండో రౌండ్‌‌కు చేరుకున్నాడు.

లెజెండ్‌‌ను మెప్పించిన నగల్‌‌

రోజర్‌‌ ఫెడరర్‌‌తో తలపడిన హర్యానా కుర్రాడు సుమిత్‌‌ మంచి మార్కులు కొట్టేశాడు. అంత  తేలిగ్గా లొంగని 190వ ర్యాంకర్‌‌ సుమిత్‌‌ 6–4, 1–6, 2–6, 4–6తో ఫెడెక్స్‌‌ చేతిలో పోరాడి ఓడాడు. రెండు గంటలా25 నిమిషాల పాటు పోరాడిన సుమిత్‌‌ ఫస్ట్‌‌ సెట్‌‌ గెలవడమే కాక మూడో గేమ్‌‌లోనే రోజర్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేశాడు. గత 20 ఏళ్లలో గ్రాండ్‌‌స్లామ్‌‌ మెయిన్‌‌ డ్రా లో సెట్‌‌ గెలిచిన నాలుగో ఇండియన్‌‌గా నిలిచాడు. సోమ్‌‌దేవ్‌‌, యుకీ బాంబ్రీ,  సాకేత్‌‌ మైనేని గతంలో ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌‌లో ఫెడరర్‌‌ 19 అనవసర తప్పిదాలు చేయగా, నగల్‌‌ కేవలం తొమ్మిది తప్పిదాలు చేశాడు. మరో ఇండియన్‌‌ ప్రజ్నేశ్‌‌ 4–6, 1–6, 2–6తో మెద్వెదెవ్‌‌ (రష్యా) చేతిలో ఓడిపోయాడు.

షరపోవా ఔట్

మహిళల సింగిల్స్‌‌ విలియమ్స్‌‌ సిస్టర్స్‌‌,  పెట్రా క్విటోవా, ఎలినా స్వితోలినా బోణీ కొట్టారు. కెరీర్‌‌లో 24వ గ్రాండ్‌‌స్లామ్‌‌ వేటలో ఉన్న ఎనిమిదో సీడ్‌‌ సెరెనా విలియమ్స్‌‌  6–-1, 6–-1తో మరియా షరపోవా(రష్యా)పై సులువుగా గెలిచింది. వీనస్‌‌ విలియమ్స్‌‌ 6–-1, 6–-0తో సై జెంగ్‌‌ (చైనా)పై గెలిచింది. రెండో ర్యాంకర్‌‌,  ఆస్ట్రేలియా స్టార్‌‌ బార్టీ 1–-6, 6–-3, 6–-2తో 80వ ర్యాంకర్‌‌ జరినా దియాస్‌‌(కజకిస్తాన్‌‌)పై కష్టపడి గెలిచింది. 2016 టోర్నీ రన్నరప్‌‌  ప్లిస్కోవా (చెక్‌‌ రిపబ్లిక్‌‌) 7–-6(8/6), 7–-6(7/3)తో 138వ ర్యాంకర్‌‌ త్రెజా మార్టిన్కొవాపై చెమటోడ్చి విజయం సాధించింది.  ఐదో సీడ్‌‌ ఎలినా స్వితోలినా 6–1, 7–5తో విట్నే ఒయిగ్వె (అమెరికా)పై నెగ్గగా, ఆరో సీడ్‌‌ పెట్రా క్విటోవా (చెక్​ రిపబ్లిక్​) 6–2, 6–4తో సహచర ప్లేయర్​ బెలిసా అలెక్టోవాను చిత్తు చేసింది.  పదో సీడ్‌‌ మాడిసన్‌‌ కీస్‌‌ (అమెరికా) 7–5, 6–0తో డొయి  (జపాన్‌‌)ను,  12వ సీడ్‌‌ సెవత్సోవా (లాత్వియా) 6–3, 6–3తో యుగెనీ బౌచర్డ్‌‌ (కెనడా)ను ఓడించారు.

నగల్‌‌కు మంచి ఫ్యూచర్‌‌ ఉంది..

సుమిత్‌‌ ఆట చూస్తే తానేం చేయగలడో తనకి బాగా తెలుసు అనిపిస్తుంది. అదే అతన్ని  కెరీర్‌‌లో చాలా దూరం తీసుకెళుతుంది. అతని ఆటలో ఆశ్యర్యం కలిగించే అంశాలు లేకపోయినా చాలా నిలకడగా ఆడుతున్నాడు. కోర్ట్‌‌లో కదలికలు, బాల్‌‌ రిటర్న్‌‌ చేసే విధానం చూస్తుంటే సిసలైన క్లే కోర్ట్‌‌ ప్లేయర్‌‌ కనిపిస్తున్నాడు. ఏడాదిగా క్లే కోర్ట్‌‌ల్లో ఆడడం వల్ల ఆట తీరు అలవాటైంది అనుకుంటున్నా. కెరీర్‌‌లో తొలి గ్రాండ్​స్లామ్​ మ్యాచ్‌‌ అయినా సుమిత్‌‌ ఒత్తిడిని బాగా హ్యాండిల్‌‌ చేశాడు. గ్రాండ్‌‌స్లామ్‌‌ ఆడాలనేది ప్రతీ ప్లేయర్‌‌ కలే అయినా, అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవడం ఎవ్వరికీ అంత ఈజీ కాదు. సుమిత్‌‌ ఆ విషయంలో సక్సెస్‌‌ అయ్యాడు.

– సుమిత్‌‌ నగల్‌‌తో మ్యాచ్‌‌అనంతరం ఫెడరర్‌‌

ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా

గ్రాండ్‌‌స్లామ్‌‌ అరంగేట్రంలో ఇంతకంటే గొప్ప మ్యాచ్‌‌ మరొకటి ఉండదనుకుంటా. అది కూడా అతి పెద్ద టెన్నిస్‌‌ కోర్ట్‌‌లో ఆడడం చాలా అద్భుతంగా అనిపించింది. కోర్ట్‌‌లో గడిపిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా. రోజర్‌‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఎలా నడుచుకోవాలి, ఎమోషన్స్‌‌ని ఎలా నియంత్రించుకోవాలి, షాట్స్‌‌ను ఎలా మార్చిమార్చి ఆడాలో అర్థం చేసుకున్నా.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి