ఈబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి

ఈబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి
  • వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: అగ్రవర్ణాల వారంతా సంపన్నులనే భావన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాయని, ఇది సరికాదని ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు. వేళ్లపై లెక్కించే కొంతమంది ధనవంతులను చూపి అగ్రవర్ణాల్లోని పేదలకు అన్యాయం చేయొద్దని, వారికి విద్య, ఉద్యోగ, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌‌ జూబ్లీహిల్స్ లోని ఈబీసీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడారు. 

ఆర్థికంగా వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈబీసీ మంత్రిత్వ శాఖను, ఈబీసీ కార్పొరేషన్, ఈబీసీ కమిషన్‌‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల కోసం పోరాటం చేయాలని, అందుకు దేశవ్యాప్తంగా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు రవిశంకర్, ఉపాధ్యక్షులుగా ఉన్నం సుబ్బారావు, నీలగిరి దయాకర్ రావు, గట్టు శ్రీనివాసాచార్యులు, నూకల పద్మారెడ్డి, ప్రచార కార్యదర్శిగా యూసుఫ్ బాబు, జాయింట్ సెక్రటరీ పోచంపల్లి రమణారావు ఎన్నికయ్యారు.