అదృష్టంగా భావించను..బాధ్యతగా తీస్కుంట: గడ్డం వంశీ కృష్ణ

అదృష్టంగా భావించను..బాధ్యతగా తీస్కుంట: గడ్డం వంశీ కృష్ణ
  •    ప్రజలకు అందుబాటులో ఉంటా
  •     తాత వెంకటస్వామి ఆశయాలు కొనసాగిస్తా: గడ్డం వంశీ కృష్ణ
  •     పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

పెద్దపల్లి, వెలుగు: ఎంపీగా పోటీ చేసేందుకు తనకు వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించనని, బాధ్యతగా తీస్కుంటా అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. భారీ మెజారిటీతో గెలిచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా అని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మరోసారి చెప్తున్నట్టు తెలిపారు. తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, తల్లి సరోజ వివేక్, భార్య రోషినితో కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీ కృష్ణ కలెక్టరేట్​లో శుక్రవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 

ఆయన వెంట ఎమ్మెల్యేలు విజయరమణారావు, లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పార్టీ సీనియర్ నేత దుర్గం నరేశ్ ఉన్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడారు. ‘‘చిన్న వయసులో ఎంపీగా పోటీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. దీన్ని అదృష్టంగా భావించకుండా.. బాధ్యతగా తీస్కుంట. తాత వెంకటస్వామి వారసుడిగా ఆయన ఆశయాలు కొనసాగిస్తా. కాకా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తుపాకీ తూటాలకు ఎదురు నిలిచి పోరాడారు’’అని గుర్తు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పరిశ్రమలు తీసుకురావడానికి మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీస్కుంటానని అన్నారు. 

ప్రతి ఒక్కరు తమ ఇంట్లో చిన్న కొడుకుగా భావించి గెలిపించాలని కోరారు. తర్వాత ఎమ్మెల్యేలు విజయ రమణరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. ‘‘పదేండ్లు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలంతా బీఆర్ఎస్ అరాచకాలకు బలయ్యారు. అయినా.. పార్టీని వీడకుండా పోరాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలవుతున్నాయి. బీఆర్ఎస్ కావాలనే కాంగ్రెస్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది’’అని మండిపడ్డారు. పంట చివరి దశలో నీరు కావాల్సి ఉండగా.. ముగ్గురం ఎమ్మెల్యేలం సీఎం దృష్టికి తీసుకుపోతే వెంటనే నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఏడు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.