వనపర్తి, వెలుగు : లైంగిక దాడులు, హింసకు గురైన మహిళలు, పిల్లలకు ఒకే చోట అన్ని రకాల సేవలు, రక్షణ అందించడమే భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంతో పాటు, ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో జిమ్ సెంటర్‌ను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ సునీతా రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోక్సో బాధితుల గోప్యతను కాపాడుతూ వారికి న్యాయ, మానసిక సహాయం అందించడంలో తెలంగాణ భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అనంతరం ప్రజాపాలన వారోత్సవాల క్రీడల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలైన పోలీస్ జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన టీచర్ల జట్టుకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాకు క్రీడాపర్తిగా గొప్ప పేరుంది
పెబ్బేరు : క్రీడల పరంగా వనపర్తి జిల్లాకు క్రీడాపర్తిగా గొప్ప పేరొందిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నా రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభిలతో కలిసి పెబ్బేరు పట్టణంలోని పీజేపీ క్యాంపులోని ఫుట్ బాల్ఆడి సీఎం కప్ పోటీలను, కలెక్టర్ నిధుల నుంచి ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు. అంతకుముందు మండలంలోని సూగూరు గ్రామంలో హజ్రత్ ఫఖురుల్లాషా ఖాద్రి రహమతుల్లా హలై బాబా దర్గా వద్ద నిర్వహించిన ఉర్సు ఉత్సవాల ముగింపులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు
