ప్లాట్ల రిజిస్ట్రేషన్‌‌కు పైసలు డిమాండ్‌‌..రూ. 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్‌‌రిజిస్ట్రార్

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌‌కు పైసలు డిమాండ్‌‌..రూ. 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్‌‌రిజిస్ట్రార్

 

  • రూ. 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్‌‌రిజిస్ట్రార్‌‌
  • రూ. 5 వేలతో పట్టుబడిన ఆదిలాబాద్‌‌ సబ్‌‌ రిజిస్ట్రార్‌‌

ఎల్బీనగర్/ఆదిలాబాద్‌‌ టౌన్‌‌, వెలుగు :  ప్లాట్లను రిజిస్ట్రేషన్‌‌ చేసేందుకు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం, ఆదిలాబాద్‌‌ సబ్‌‌ రిజిస్ట్రార్లు ఏసీబీ ఆఫీసర్లకు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌‌లో 200 గజాల ప్లాట్‌‌ రిజిస్ట్రేషన్‌‌ కోసం ఓ వ్యక్తి  వనస్థలిపురం సబ్‌‌రిజిస్ట్రార్‌‌ రాజేశ్‌‌కుమార్‌‌ను కలిశాడు. రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియ పూర్తి కావాలంటే రూ. లక్ష ఇవ్వాలని సబ్‌‌రిజిస్ట్రార్‌‌ డిమాండ్‌‌ చేయగా.. రూ. 70 వేలకు ఒప్పందం కుదిరింది. తర్వాత బాధితుడు ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శుక్రవారం వనస్థలిపురం సబ్‌‌రిజిస్ట్రార్‌‌ ఆఫీస్‌‌కు వెళ్లి.. ఓ డాక్యుమెంట్‌‌ రైటర్‌‌ దగ్గర పనిచేసే రమేశ్‌‌ అనే కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌కు రూ. 70 వేలు ఇవ్వగా.. అతడు సబ్‌‌రిజిస్ట్రార్‌‌కు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సబ్‌‌రిజిస్ట్రార్‌‌ రాజేశ్‌‌కుమార్‌‌తో పాటు కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌ రమేశ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. సబ్‌‌రిజిస్ట్రార్‌‌ ఇంటితో పాటు అతడి బంధువుల ఇండ్లలోనూ సోదాలు చేశారు. 

గిఫ్ట్‌‌ డీడ్‌‌ రిజిస్టేషన్‌‌ కోసం...

గిఫ్ట్‌‌ డీడ్‌‌ రిజిస్ట్రేషన్‌‌ కోసం లంచం డిమాండ్‌‌ చేసిన ఆదిలాబాద్‌‌ సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డిని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఆదిలాబాద్‌‌ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం... బేల మండలంలోని సిరిసన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గిఫ్ట్‌‌ డీడ్‌‌ రిజిస్ట్రేషన్‌‌ కోసం ఓ ఏజెంట్‌‌ ద్వారా సబ్‌‌రిజిస్ట్రార్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డిని కలువగా.. అతడు రూ. 5 వేలు డిమాండ్‌‌ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో శుక్రవారం రిజిస్ట్రేషన్‌‌ ఆఫీస్‌‌కు వచ్చి ఏజెంట్‌‌కు డబ్బులు ఇవ్వగా.. అతడు సబ్‌‌రిజిస్ట్రార్‌‌కు అందజేశాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సబ్‌‌రిజిస్ట్రార్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డిని రెడ్‌‌హ్యాండెడ్‌‌గా 
పట్టుకున్నారు.