నెల రోజులుగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా పట్టించుకోలేదని

నెల రోజులుగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా పట్టించుకోలేదని

హైదరాబాద్: నెల రోజులుగా కాలనీలోని డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కాలనీల వాసులు ఆందోళన చేపట్టారు. వనస్థలిపురం జలమండలి ఆఫీసుకు తాళం వేసి కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు.

రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ మధురా నగర్, రాఘవేంద్ర నగర్, కీర్తన ఎన్ క్లేవ్, ధనలక్ష్మి నగర్, బృందావన కాలనీల వాసులు పాల్గొన్నారు.  గత నెల రోజులుగా ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోనీ కాలనీల్లో డ్రైనేజీలు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మురుగు నీరు చేరి స్థానికులు వ్యాధుల బారిన పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కూడా అధికారులు ఆఫీసుకు రాకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నెల 29వ తేదీన ఇదే సమస్యపై నాగోల్ లో స్థానికులతో కలిసి బీజేపీ నాయకులు రస్తారోకో చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమ తప్పు లేదంటున్నారు జలమండలి శాఖ అధికారులు. కాలనీ వాసులు ఆర్చ్ నిర్మించే టైంలో డ్రైనేజ్ ని ధ్వంసం చేశారని చెబుతున్నారు అధికారులు.