బైక్ మీద వచ్చి డబ్బు దోచుకెళ్లిన ఇద్దరు దుండగులు

బైక్ మీద వచ్చి డబ్బు దోచుకెళ్లిన ఇద్దరు దుండగులు

ఎల్​బీనగర్, వెలుగు: వనస్థలిపురంలో దారి దోపిడీ జరిగింది. బార్​ నుంచి ఓనర్ రూ.50లక్షల క్యాష్​తో స్కూటీమీద ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు అడ్డగించారు. ఓనర్ వద్ద ఉన్న రూ.25లక్షలతో పరారయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. వనస్థలిపురం కమలానగర్​లో ఉంటున్న ఎం.వెంకట్ రెడ్డి ఆటో నగర్ లోఎంఆర్ఆర్ బార్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో మరో వ్యక్తితో కలిసి బార్ నుంచి క్యాష్​ తీసుకుని స్కూటీపై ఇంటికి బయల్దేరాడు. కమలానగర్ వద్దకు చేరుకోగానే బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు వీళ్ల స్కూటీని ఢీకొట్టి అడ్డగించారు. రూ.25లక్షల క్యాష్​ ఉన్న బ్యాగ్​తో పరారయ్యారు.  మరో రూ.25 లక్షలు స్కూటీ డిక్కీలో ఉండటంతో దొంగల బారిన పడలేదని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ మొత్తం రూ.50 లక్షలు ఎక్కడివనేదానికి ఎలాంటి పత్రాలు లేవని, హవాలా డబ్బా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామన్నారు. 

దొంగలు ఎత్తుకెళ్లింది రూ.1.75 కోట్లు?

బార్ ఓనర్ వెంకట్ రెడ్డి నరేశ్ అనే వ్యక్తితో కలిసి రూ.2 కోట్ల నగదుతో వెళ్తుండగా దుండగులు అడ్డుకుని ఎత్తుకెళ్లారని శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. వెంకట్​రెడ్డి నుంచి దుండగులు బ్యాగ్ గుంజుకుంటుండగా అందులోంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయని, వాటిని పట్టుకెళ్లి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని ప్రచారమైంది. దీంతో దోపిడీ జరిగిన స్పాట్​ను పరిశీలించిన పోలీసులు ఆపై వెంకట్​రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేయగా రూ. కోటి క్యాష్​ పట్టుబడినట్లు సమాచారం. ఈ కేసులో ఇంకొందరిని కూడా అదుపులోకి తీసుకుని వెంకట్​రెడ్డి ఇంట్లో అంత డబ్బెక్కడిదని పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.