మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2025 మార్చిలో L2: ఎంపురాన్, ఏప్రిల్ లో తుడురం వంటి సినిమాలు చేసి భారీ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలు మలయాళ ఇండస్ట్రీలోనే భారీ కలెక్షన్స్ సాధించాయి. అయితే, ఇదే 2025 చివర్లో, అంటే క్రిస్మస్ (డిసెంబర్ 25న) వృషభ (Vrusshabha) మూవీతో వచ్చారు మోహన్ లాల్. ఈ సినిమాతో మోహన్ లాల్ కెరీర్లోనే, ఘోర పరాజయాన్ని చవిచూసారు మోహన్ లాల్. రూ.70 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.2 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇక నష్టాలూ ఏ స్థాయిలో ఉన్నాయో చూసుకోండి ! ఈ లెక్కన ఈ సినిమా ద్వారా నిర్మాతలకు దాదాపు 97 శాతం నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వృషభ మూవీ గురించి:
మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నంద కిషోర్ రూపొందించిన చిత్రం ‘వృషభ’. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌తో కలిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగులో రిలీజ్ చేసింది.
అయితే, విడుదలైన తొలి రోజే వృషభ దేశవ్యాప్తంగా కేవలం రూ. 60 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ చిత్రానికి ఆశించిన స్పందన దక్కలేదు. రెండో రోజు నుంచే వసూళ్లు గణనీయంగా పడిపోవడంతో, వీకెండ్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
వృషభ విడుదలై ఆరు రోజులు పూర్తయ్యే సరికి, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే రూ.70 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి వృషభ సినిమా తీస్తే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.2 కోట్లు మాత్రమే సాధించగలిగింది. దీంతో నిర్మాతలకు 97 శాతం నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం వారం రోజుల థియేటర్ రన్ ఉంటుంది. అయితే, వృషభ వసూళ్లు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో, నష్టాలను మరింత పెరగకుండా చూడాలన్న ఉద్దేశంతో మంగళవారం (డిసెంబర్ 30, 2025) నాటికే ఈ సినిమాను చాలా చోట్ల స్క్రీన్ల నుంచి తొలగించడం గమనార్హం!
'వృషభ' కథ:
'వృషభ' సినిమా కథ రెండు కాలాల్లో జరుగుతుంది: గతంలో త్రిలింగ రాజ్యానికి రాజు అయిన విజయేంద్ర వృషభ (మోహన్‌లాల్) ఆత్మలింగాన్ని కాపాడే క్రమంలో పొరపాటున ఒక బిడ్డను చంపడంతో, ఆ తల్లి శాపానికి గురై తన కొడుకు చేతిలోనే చావు తప్పదనే శాపంతో జీవిస్తారు. ఆ తర్వాత వర్తమానంలో బిజినెస్‌మేన్ అయిన ఆదిదేవ వర్మ (మోహన్‌లాల్) తన ఊరికీ, అక్కడున్న తన శత్రువులకు దూరంగా ఒక్కగానొక్క కొడుకు తేజ్ వర్మ (సమర్జిత్ లంకేశ్)తో కలిసి నివసిస్తుంటాడు. తండ్రీ తనయులకు ఒకరంటే ఒకరికి ప్రాణం. తన తండ్రిపై ఈగ కూడా వాలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు తేజ్. కొడుకు పెళ్లి చేసుకుని వారసుల్ని చేతిలో పెడితే చూసుకోవాలనేది ఆదిదేవ వర్మ ఆశ.
ఇక ఇదే క్రమంలో తన గత జన్మ జ్ఞాపకాలు, శాపాలు ఆదిదేవ వర్మను వెంబడిస్తాయి. వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తూ, తన కొడుకుతో సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే కథ. ఓవరాల్ గా చెప్పాలంటే, ఇది పునర్జన్మ, విధి, వారసత్వం వంటి అంశాలను చర్చిస్తుంది, ఇక్కడ గత జన్మ కర్మలు ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మోమెంట్స్‌తో పాటు హీరో క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కథ సాగుతుంది.
