కాచిగూడ - బెంగళూరు వందే భారత్ టికెట్లు రేట్లు, టైమింగ్స్

కాచిగూడ - బెంగళూరు వందే భారత్ టికెట్లు రేట్లు, టైమింగ్స్

హైదరాబాద్ కాచిగూడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఎనిమిదిన్నర గంటల్లోనే కాచిగూడ నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. మిగతా సూపర్ ఫాస్ట్ రైళ్లతో పోల్చితే మూడు గంటల సమయం ఆదా అవుతుంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న కాచిగూడ.. బెంగళూరు వందే భారత్ రైలులో టికెట్లు ఎలా ఉన్నాయి..?  రైలు టైమింగ్స్ ఏంటి..?  ఏయే రైల్వే స్టేషన్లలో ఆగుతుంది..? అనే వివరాలు తెలుసుకుందాం..

నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లలో మెరుగైన సదుపాయాలతో వస్తున్న ఈ రైళ్లు ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నాయి. తాజాగా వీటి టికెట్‌ ధరలు వెల్లడయ్యాయి.

కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ టికెట్ ధర రూ.1600

కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ (20703) మధ్య బుధవారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం 05:30 గంటలకు రైలు కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) జంక్షన్‌ చేరుకుంటుంది. 

610 కిలోమీటర్ల దూరానికి 8.30 గంటల ప్రయాణం ఉంటుంది. మధ్యలో మహబూబ్‌నగర్‌ (6.49), కర్నూలు సిటీ (8.24), అనంతపురం (10.44), ధర్మవరం జంక్షన్‌ (11.14) స్టేషన్లలో ఆగుతుంది.

కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1600గా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ ధర రూ.2915గా నిర్ణయించారు. ఇందులో కేటరింగ్‌ ఛార్జీలు అంతర్భాగంగా ఉంటాయి.

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (20704) మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంతపూర్‌లో బయల్దేరుతుంది. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. ధర్మవరం జంక్షన్‌ (4.59), అనంతపురం (5.29), కర్నూలు సిటీ (7.50) మహబూబ్‌నగర్‌ (9.34) స్టేషన్లలో నిమిషం చొప్పున ఆగుతుంది. 

తిరుగు ప్రయాణంలో మాత్రం ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1540 గానూ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.2865గానూ రైల్వే శాఖ నిర్ణయించింది. కేటరింగ్‌ ఛార్జీల్లో వ్యత్యాసమే  కారణం.