
దివంగత వంగవీటి మోహనరంగ తనయుడు, వంగవీటి రాధా వివాహం విజయవాడలో అంగరంగ వైభంగా జరిగింది. అక్టోబర్ 22న రాత్రి విజయవాడలోని పోరంకి మురళీ రిసార్ట్ లో జరిగిన ఈ పెళ్లికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ హాజరయ్యారు. రాధాకు పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె అయిన పుష్పవల్లితో రాధా ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగింది. జక్కం అమ్మాని 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక పుష్పవల్లి. స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంతకాలం హైదరాబాద్‌లో యోగా టీచర్‌గా పనిచేసిన పుష్పవల్లి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు.
వంగవీటి మోహనరంగ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయన.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి .. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం రాధ టీడీపీలో ఉన్నారు.