V6 News

విచారణకు కోర్టు ఓకే

విచారణకు కోర్టు ఓకే

వారణాసి(యూపీ): కాశీ నగరంలోని జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్​ను వారణాసి జిల్లా కోర్టు కొట్టేసింది. జ్ఞానవాపి మసీదు గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలను పూజించేందుకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించింది. ఆ పిటిషన్​ను విచారణకు స్వీకరించొద్దని మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ సోమవారం తీర్పు చెప్పారు. మసీదు వక్ఫ్​బోర్డు ప్రాపర్టీ అయినందున పూజలకు అనుమతించొద్దన్న వాదనను తోసిపుచ్చారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991, వక్ఫ్​యాక్ట్ 1995, యూపీ శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ యాక్ట్1983కు హిందూ మహిళల పిటిషన్ వ్యతిరేకంగా లేదని తేల్చిచెప్పారు. ఆ పిటిషన్ పై ఈ నెల 22న విచారణ జరుపుతామన్నారు.

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్​ను శృంగార్ గౌరి ఆలయంపై కట్టారన్న వివాదానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా కోర్టు విచారిస్తోంది. మసీదులో వీడియో తీస్తూ సర్వే చేయాలని ఇంతకుముందు కోర్టు ఆదేశించింది. తాజాగా హిందూ మహిళల పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. కాగా, కోర్టు తమ పిటిషన్ ను విచారణకు స్వీకరించడంతో కోర్టు బయట సోహన్ లాల్ ఆర్య, ఇతర పిటిషనర్లు సహా పలువురు హిందువులు స్వీట్లు పంచుతూ సంతోషం వ్యక్తం చేశారు. సెన్సిటివ్ విషయం కావడంతో మసీదు వద్ద ఆదివారం నుంచే భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తామని మసీదు కమిటీ తెలిపింది.