Kitchen Telangana: బెండ, దొండ,బీన్స్ తో వెరైటీ ఫ్రై .. టేస్ట్ అదరాల్సిందే.. ఒక్కసారి తింటే అసలు వదలరు ! ..

Kitchen Telangana: బెండ, దొండ,బీన్స్ తో వెరైటీ ఫ్రై .. టేస్ట్ అదరాల్సిందే.. ఒక్కసారి తింటే అసలు వదలరు ! ..

 నాలుగు కూరలతో తింటేనే భోజనం పూర్తయినట్టు అనిపిస్తుంది కొందరికి. ఇంకొందరు ఒక్క కూర ఉన్నా చాలు. మెతుకు మిగల్చకుండా ప్లేట్ ఖాళీ చేస్తారు. తినే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలామంది పప్పు సాంబారులో పాపడాలు, వడియాలను నంజుకుని తింటుంటారు. వాటికి బదులుగా వివిధరకాల కూరగాయలతో ఫ్రైలు చేసుకొని కూడా తినొచ్చు.

కుర్​ కురీ బేండీ ఫ్రై తయారీకి కావలసినవి

  • బెండకాయ తరుగు - ఒక కప్పు 
  • పసుపు-చిటికెడు 
  • కారం- ఒక టీ స్పూన్
  • ధనియాల పొడి- ఒక టీస్పూన్
  •  జీలకర్ర పొడి- చిటికెడు
  •  గరం మసాలా- అర టీ స్పూన్
  • చాట్ మసాలా- అర టీస్పూన్ 
  • శెనగపిండి- అర కప్పు
  • ఉప్పు -తగినంత
  • నూనె - సరిపడా

తయారీ విధానం: ఒక గిన్నెలో శెనగపిండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు వేయాలి. అందులో నీళ్లు పోసి జారుగా కలపాలి. తర్వాత శుభ్రం చేసుకున్న బెండకాయ ముక్కలను పిండిలో ముంచి, నూనెలో డీప్ ఫ్రై చేయాలి. లేదంటే పిండిని గట్టిగా కలిపి ముక్కలకు పట్టించి ఫ్రై చేసుకోవచ్చు. ఈ కుర్ కురీ బేండీని పప్పులో సంజుకుంటే టేస్ట్ సూపర్ గా ఉంటుంది.

క్రంచీ బీన్స్ ఫ్రై తయారీకి కావలసినవి

 బీన్స్- పావు కిలో
నూనె - సరిపడా 
వెల్లుల్లి తరుగు -ఆరు
 రెడ్ చిల్లీ ఫ్లేక్స్-ఒక టీ స్పూన్
ఉప్పు- తగినంత
జీలకర్ర- పావు టీ స్పూన్
 ఆవాలు-పావు టీ స్పూన్
 మిరియాల పొడి- చిటికెడు
కారం- కొద్దిగా
ఎండుకొబ్బరి పొడి- ఒక టేబుల్ స్పూన్ (కావాలంటే)

తయారీ విధానం: పాన్​ లో  నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, ముక్కలుగా తరిగిన బీన్స్ వేయాలి. పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. ఐదు నిమిషాల తర్వాత వెల్లుల్లి తరుగు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, కారం, ఎండుకొబ్బరి పొడి వేసి మగ్గించాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయాలి. వీటిని స్నాక్స్ గా తినొచ్చు. అలాగే సాంబారు, పెరుగన్నంలో కూడా నంజుకోవచ్చు.

దొండకాయ ఫ్రై  తయారీకి కావలసినవి

దొండకాయలు - అర కప్పు
 జీలకర్ర - అర కప్పు
ఎండు మిర్చి- నాలుగు
పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్ స్పూన్
 ఇంగువ-చిటికెడు
 పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి - ఒక్కోటి అర టీ స్పూన్ చొప్పున
 కరివేపాకు- ఒక రెమ్మ
ఉప్పు- తగినంత
నిమ్మరసం- ఒక టీ స్పూన్
నూనె- సరిపడా

తయారీ విధానం : ఒక్కో దొండకాయను నిలువుగా నాలుగు ముక్కలు చేసి పక్కన పెట్టాలి. స్టవ్​ పై  పాన్​ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కరివేపాకు వేయాలి. అవన్నీ వేగాక దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో ఇంగువ, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి పావుగంట సేపు ఉడికించి దింపేయాలి. దీన్ని అన్నంలో కలుపుకోవచ్చు లేదా సాంబారులో నంజుకోవచ్చు.

 వెలుగు,లైఫ్​