కొబ్బరి చిప్పలు బువ్వ పెడ్తున్నయి

కొబ్బరి చిప్పలు బువ్వ పెడ్తున్నయి

కృష్ణా, రామా! అంటూ కాలం గడపాల్సిన వయసులో బతుకు పోరాటానికి దిగాల్సివచ్చింది. అలాగని వెనకడుగు వేయలేదు వీళ్లు. తాతలు వారసత్వంగా ఇచ్చిన కళను నమ్ముకున్నారు. దానికి కొత్తదనాన్ని చేర్చారు.  మనసుండాలే కానీ వయసుతో పనిలేదని నిరూపించారు.

కేరళలోని కొట్టాయం ఉంటారు 72 ఏండ్ల కుంచన్‌‌కుట్టి, 62 ఏండ్ల లక్ష్మి. కుంచన్‌‌కుట్టి ఫ్యామిలీ వృత్తి పరంగా కార్పెంటర్‌‌‌‌ పని చేసేవాళ్లు. కానీ, కుంచన్‌‌కుట్టి మాత్రం వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పిల్లలు లేకపోయినా ఎప్పుడూ బాధపడలేదు వీళ్లు. కానీ, 2004లో చెరువును ఆక్రమించి  వ్యవసాయం చేస్తున్నారన్న కారణంతో వాళ్ల భూమిని గవర్నమెంట్‌‌ తీసుకుంది. ‘జీవనాధారంగా ఉన్న భూమి పోయింది. ఇక ‘ఎలా బతకాల’ని బాధపడుతున్నప్పుడు కుంచన్‌‌కుట్టి మేనల్లుడు ఇంటికి వచ్చాడు. అప్పుడు ట్రెండింగ్‌‌లో ఉన్న కొబ్బరి చిప్పల ఆర్ట్‌‌ గురించి చెప్పి, వాళ్లను ఒకసారి ట్రై చేయమన్నాడు. ఒక కొబ్బరి చిప్పమీద కోతి బొమ్మ చెక్కాడు కుంచన్‌‌. చూసిన వాళ్లు భలే ఉందని మెచ్చుకుని, దాన్నే  బిజినెస్‌‌ చేయమని సలహా ఇచ్చారు. 

అరవై వేల లోన్‌‌తో...
పేదరిక నిర్మూలన, విమెన్‌‌ ఎంపవర్‌‌‌‌మెంట్‌‌ ప్రోగ్రామ్‌‌ కింద కుదుంబశ్రీలో మెంబర్‌‌‌‌ లక్ష్మి. ఆ స్కీం ద్వారా బ్యాంక్‌‌లో 60 వేల రూపాయల లోన్ తీసుకుంది.  ఆ డబ్బుతో మెషినరీ కొనుక్కున్నారు. ‘నేనూ సాయం చేస్తా. నాకూ ఈ ఆర్ట్‌‌ నేర్పించండి’ అని భర్తని అడిగింది లక్ష్మి. దాంతో ఆమెకు కూడా కొబ్బరి చిప్పల ఆర్ట్ నేర్పించాడు కుంచన్‌‌. రోజూ  100 కిలోల కొబ్బరి చిప్పలు కొనుక్కొస్తారు. వాటిని  ఎండబెట్టి, కొబ్బరి తీసేస్తారు.  చిప్పపై పొట్టును మెషిన్​తో తీసేసి స్మూత్‌‌గా చేస్తారు. వాటిమీద  జంతువులు, చేపలు, దేవుళ్లు, అలంకరణ సామాన్లు, ఇయర్‌‌‌‌ రింగ్స్‌‌తో పాటు రకరకాల డిజైన్స్‌‌ వేస్తున్నారు.  మినిస్ట్రీ ఆఫ్‌‌ రూరల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌, గవర్నమెంట్‌‌ ఆఫ్‌‌ ఇండియా పెట్టే సారస్‌‌ మేళాల్లో తాము తయారుచేసిన డిజైన్స్‌‌ అమ్మకానికి పెడుతున్నారు. ఢిల్లీ, కోల్‌‌కతా, బెంగళూరులో కూడా కొబ్బరి చిప్పల కళారూపాలు దొరుకుతాయి. కేరళలో ఉన్న అన్ని జిల్లాలకు తాము తయారుచేసిన ప్రొడక్ట్స్‌‌ డెలివరీ ఇస్తున్నారు కుంచన్​ కుట్టి దంపతులు.   

‘మొదట్లో ఈ పని చేయడం కొంచెం కష్టంగా అనిపించేది. కానీ, ఇప్పుడు అలవాటైపోయింది. వీటిని అమ్మడంవల్ల వచ్చే సంపాదనతో ఇంతకుముందుకంటే బాగా బతకగలుగుతున్నాం. మా ప్రొడక్ట్స్ ధరలు 50 రూపాయల నుంచి, వెయ్యి రూపాయల వరకు ఉంటాయి’ అని చెప్పింది ఈ  జంట.