ఆమె గొప్ప డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలి అని కలలు కన్నది. కానీ.. ఓ వైపు పేదరికం, మరోవైపు కుటుంబ బాధ్యతలు అడ్డుపడ్డాయి. తల్లి కష్టం చూడలేక చిన్న వయసులోనే ఆమెతోపాటు ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లేది. ఆ తర్వాత లక్ష్యం నెరవేరకుండానే వర్షాకి పెండ్లి జరిగింది. కానీ.. ఆమె అంతటితో ఆగిపోకుండా తనకు కూతురు పుట్టిన తర్వాత సొంతంగా డ్యాన్స్ నేర్చుకుంది. సోషల్ మీడియాలో లక్షలమంది అభిమానాన్ని సంపాదించుకుంది.
ఇది సోషల్ మీడియా యుగం. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే సినిమాల్లో లేదా టీవీలో కనిపించాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్ల కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్లకున్న ఫేమ్‌తో టీవీ షోలు, సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
అలాంటి కోవాలోకి చెందినదే వర్షా సోలంకి. సోషల్ మీడియాలో సంపాదించుకున్న క్రేజ్ వల్ల వర్ష పోయినేడు ‘డ్యాన్స్ దివానే సీజన్–4’లో పార్టిసిపేట్ చేసి ఎంతోమందిని అలరించింది. అయితే.. ఎప్పుడూ సరదాగా మాట్లాడే వర్ష జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఎన్నో ట్రోల్స్..
కూతురు పెద్దయ్యాక వర్షకు తన జీవితం మీద ఫోకస్ పెట్టేందుకు కాస్త టైం దొరికింది. దాంతో డ్యాన్సర్ కావాలనే తన ఆశలు మళ్లీ చిగురించాయి. సొంతంగా డ్యాన్స్ నేర్చుకుంది. కానీ.. ఆమె ట్యాలెంట్ నాలుగు గోడలకే పరిమితమైంది. అందుకే సోషల్ మీడియా వేదికగా తనను తను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అనుకుంది. డ్యాన్స్ వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన మొదటి వీడియోలో డ్యాన్స్‌తోపాటు కాస్త కామెడీని కూడా మిక్స్ చేసింది.
కానీ.. రీచ్ పెద్దగా రాలేదు. పైగా ఎంతోమంది ఆమెని ఎగతాళి చేశారు. ఆమెను కిందకు లాగడానికి తెర వెనుక దాక్కుని ట్రోల్స్ చేశారు. అయినా వర్ష వెనుకడుగు వేయలేదు. రెగ్యులర్‌గా కొత్త కంటెంట్ అప్లోడ్ చేసేది. కొన్నాళ్లకు వ్యూస్ పెరిగి, వీడియోలు వైరల్ అయ్యాయి. ‘‘మొదట్లో జనాలు నన్ను చూసి నవ్వారు. కానీ.. నా వీడియోలు వైరల్ అయిన తర్వాత మెచ్చుకున్నారు” అంటూ గత జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది వర్ష. ప్రస్తుతం ఆమె డ్యాన్స్‌తోపాటు కామెడీ వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేస్తోంది. వాటిలో అప్పుడప్పుడు ఆమె కూతురు కూడా కనిపిస్తుంటుంది.
పనిమనిషిగా..
ముంబైకి చెందిన వర్ష ఒక పేద కుటుంబంలో పుట్టి, పెరిగింది. ఆమెకు చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. వాళ్ల నాన్న బాగా తాగేవాడు. కుటుంబ కష్ట సుఖాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో తల్లి ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ కుటుంబాన్ని పోషించేది. తనతో పాటు తన చెల్లికి కావాల్సినవన్నీ సమకూర్చేది. అందుకే వర్ష కూడా కుటుంబ బాధ్యతలు పంచుకునేది. అప్పుడప్పుడు వాళ్ల అమ్మతో కలిసి పనికి వెళ్లి, ఇళ్లలో గిన్నెలు కడుగుతూ సాయం చేసేది. అలా కొన్నేండ్లు గడిచాక వర్ష పెండ్లి జరిగింది. తర్వాత ఒక కూతురు పుట్టింది. దాంతో డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకున్న తన కల కలగానే మిగిలిపోయింది.
సోషల్‌మీడియా టు రియాలిటీ షో
ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె డ్యాన్స్ టాలెంట్ అందరికీ తెలిసింది. అప్పుడే ఆమెకు కలర్స్ టీవీ నుంచి ఫోన్ వచ్చింది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దీవానే’లో పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కింది. అప్పటివరకు షార్ట్ వీడియోలతో అలరించిన వర్ష తన డ్యాన్స్‌తో షోలో జడ్జీలతోపాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. జడ్జీగా ఉన్న సునీల్ శెట్టి వర్షను ‘‘నువ్వు నిజమైన హీరోవి. ప్రజలు నీ నుంచి చాలా నేర్చుకోవాలి”అంటూ ప్రశంసించాడు. మరో జడ్జీ మాధురి స్వయంగా తను సోషల్‌మీడియాలో వర్షని ఫాలో అవుతానని, వీడియోలు చూస్తుంటానని చెప్పింది.
ఫాలోయింగ్
వర్ష 2018 ఫిబ్రవరి నుంచి ఇన్స్టాగ్రామ్ వాడుతోంది. అందులో 13 వేలకు పైగా పోస్ట్‌లు చేసింది. ఇప్పటివరకు ఆమెని 6.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో ఆమెని దాదాపు 3 లక్షల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ విషయానికి వస్తే 2024 జూన్‌లో చానెల్ పెట్టింది. ఇప్పటివరకు 479 షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసింది. ప్రస్తుతం సబ్స్క్రయిబర్ల సంఖ్య లక్షకు దగ్గర్లో ఉంది. కానీ.. ఆమె అప్లోడ్ చేసిన కొన్ని వీడియోలకు ముప్పై లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.