వరుణ్ ధావన్ సినిమాకు షాక్.. రూ.400 కోట్ల దావా వేసిన వాషూ భగ్నానీ!

వరుణ్ ధావన్ సినిమాకు షాక్.. రూ.400 కోట్ల దావా వేసిన వాషూ భగ్నానీ!

బాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ కామెడీ మూవీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' రిలీజ్ కు ముందే ఊహించని లీగల్ చిక్కుల్లో పడింది. దర్శకుడు డేవిడ్ ధావన్, హీరో వరుణ్ ధావన్ కాంబినేషన్‌లో వస్తున్న  ఈ చిత్రంపై ప్రముఖ నిర్మాత, పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత వాషూ భగ్నానీ బాంబే హైకోర్టు మెట్లు ఎక్కారు. ఏకంగా రూ. 400 కోట్ల భారీ నష్టపరిహారం దావా వేశారు.

జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్, ప్రమోషన్స్, స్ట్రీమింగ్స్ అన్నీ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరు వర్గాల మధ్య ఈ లీగర్ వార్ హాట్ టాపిక్ గా మారింది.

అసలు వివాదం ఏంటి?

1999 నాటి బ్లాక్‌బస్టర్ హిట్‌ ‘బీవీ నెం. 1’ చిత్రంలోని ఐకానిక్ సాంగ్స్ 'చునరీ చునరీ', 'ఇష్క్ సోనా హై' పాటలను తమ అనుమతి లేకుండా ఈ సినిమాలో వాడుతున్నారనేది వాషూ భగ్నానీ ప్రధాన ఆరోపణ. అంతేకాదు, సినిమా టైటిల్ కూడా 'ఇష్క్ సోనా హై' లిరిక్స్ నుంచే కాపీ కొట్టారని ఆయన మండిపడ్డారు. ఇది డబ్బు కోసం చేస్తున్న పోరాటం కాదు.. మేధో సంపత్తి హక్కుల (IPR) రక్షణ కోసం. కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి అడిగినా నేనే ఉచితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేవాడిని అని భగ్నానీ ఆవేదన వ్యక్తం చేశారు. 

టైటిల్ మార్చాల్సిందే..

గతంలో తాము టిప్స్ ఇండస్ట్రీస్ కు కేవలం ఆడియో హక్కులు మాత్రమే ఇచ్చామని, కానీ ఇప్పుడు వారు అక్రమంగా విజువల్, కమర్షియల్ హక్కులను వాడుకుంటూ కొత్త వెర్షన్స్ రీమిక్స్ చేశారని భగ్నానీ తరఫు న్యాయవాది వి.కె. దూబే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సదరు పాటలను తొలగించి, సినిమా టైటిల్ మార్చాలని, లేదంటే అదనంగా మరో రూ. 100 కోట్లు చెల్లించాలని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. డేవిడ్ ధావన్, రమేష్ తౌరానీలపై చీటింగ్, ఫోర్జరీ క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని లాయర్ తెలిపారు.

‘టిప్స్’ కౌంటర్..

ఈ ఆరోపణలను టిప్స్ ఇండస్ట్రీస్ అధినేత రమేష్ తౌరానీ తీవ్రంగా ఖండించారు. తామే ఆ పాటలకు చట్టబద్ధమైన యజమానులమని, మే 22న సుప్రీంకోర్టు నుండి కూడా తమకు ఊరట లభించిందని, సినిమా అనుకున్న సమయానికే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వులపై పూర్తి వాస్తవాలను ఉంచేందుకు తాము మళ్లీ పిటిషన్ వేస్తున్నట్లు పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడించింది. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ క్రేజీ ముక్కోణపు ప్రేమకథా చిత్రం బాంబే హైకోర్టు తీర్పును బట్టి థియేటర్లలోకి వస్తుందా లేదా అనేది చూడాలి.