- ఈదురుగాలులకు కుప్పకూలిన కరెంటు పోల్స్, తెగిన వైర్లు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఈదురు గాలులు, అకాల వర్షాలతో విద్యుత్ శాఖకు రూ.కోటి వరకు నష్టం జరిగింది. మూడు రోజుల క్రితం ఈదురుగాలలకు చెన్నూరు, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, తపాలాపూర్, లింగాపూర్, కోటపల్లి, కొమ్మెర తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడమే కాకుండా లైన్లు తెగిపోయాయి.
దీంతో విద్యుత్ సంస్థకు భారీ నష్టం జరిగిందని ఎస్ఈ రాజన్న తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 210 పోల్స్ విరిగిపడినట్లు గుర్తించారు. రెండు రోజులుగా సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి కరెంట్ సప్లై పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉండటంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరగా రిపేర్లు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో జరిగిన నష్టాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి పరిశీలించారు. గురువారం రెండు మండలాల్లో పర్యటించిన ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని పోల్స్ పడిపోయాయి, ఎంత నష్టం జరిగిందనే దానిపై ఆరా తీశారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ రాజన్న, డీఈఈ కైసర్, ఏడీఈ ప్రభాకర్ రావు, ఏఈ బాపు ఉన్నారు.
