ఎన్నికల్లో లబ్ధి కోసమే..లాభాల వాటా చెల్లింపు వాయిదా

ఎన్నికల్లో లబ్ధి కోసమే..లాభాల వాటా చెల్లింపు వాయిదా
  •     ఏఐటీయూసీ స్టేట్ ​ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సర్కార్​కు లబ్ధి చేకూర్చేందుకే సింగరేణి యాజమాన్యం కార్మికులకు లాభాల వాటా, బోనస్​లను చెల్లించకుండా ఎన్నికల కోడ్​ సాకు చూపుతోందని ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మంగళవారం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఓపెన్​ కాస్ట్​ మైన్​పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్కార్​కు అనుకూలంగా సింగరేణి తీసుకున్న నిర్ణయాలతో కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఫైర్​ అయ్యారు. బుధవారం సాయంత్రంలోగా లాభాల వాటా చెల్లింపు, దసరా అడ్వాన్స్​ చెల్లింపుపై యాజమాన్యం నిర్ణయం తీసుకపోతే యూనియన్​ ఆధ్వర్యంలో ఈనెల 20న కొత్తగూడెం సింగరేణి హెడ్ ​ఆఫీస్​ ఎదుట నిరాహారదీక్ష  చేపడుతామని హెచ్చరించారు.

ఈనెల 16న లాభాల వాటా చెల్లిస్తామని 4 తేదీన సింగరేణి సర్క్యూలర్​ జారీ చేసిందని.. 9న అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్​ వాటా చెల్లింపుకు అడ్డుకాదన్నారు. వెంటనే వాటాను పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. యూనియన్​ సెంట్రల్​ కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, బ్రాంచి సెక్రటరీ ఆంజనేయులు, అసిస్టెంట్ ​సెక్రటరీ వినయ్​ కుమార్, వైస్​ ప్రెసిడెంట్​ఇప్పకాయల లింగయ్య, ఆర్కేపీ ఓసీపీ, సివిల్, సీహెచ్​పీ, ఏరియా ఆసుపత్రి, ఆర్కే1ఏ గనుల పిట్​సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. 

సింగరేణి ఇన్​చార్జ్ సీఎండీకి ఐఎన్టీయూసీ వినతి

ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేసిన సింగరేణి కార్మికుల లాభాల వాటాను వెంటనే చెల్లించాలని కోరుతూ సింగరేణి ఇన్​చార్జ్ సీఎండీ, రాష్ట్ర ఇంధన శాఖ సెక్రటరీ సుశీల్​శర్మకు ఐఎన్టీయూసీ లీడర్లు వినతిపత్రం అందించారు. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్​ బి.జనక్​ ప్రసాద్​ నేతృత్వంలో లీడర్లు ఇన్​చార్జ్ సీఎండీని కలిశారు. ఎన్నికల కోడ్​ నెపంతో కార్మికుల కష్టార్జితాన్ని ఇవ్వకుండా నిలిపివేయడం సరికాదని, వెంటనే చెల్లించాలని కోరారు. ఈనెల 21లోపు వాటా డబ్బులను కార్మికుల ఖాతాల్లో వేసేందుకు  హామీ ఇచ్చారని, ఇదే విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్​ను కూడా కలిసినట్లు సెక్రటరీ జనరల్​ జనక్ ​ప్రసాద్ ​తెలిపారు.