స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను కిడ్నాపర్లు చంపేస్తారంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని రాయదుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. ''నేను పోలీస్ ఆఫీసర్ను మాట్లాడుతున్నాను. కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్‌నకు గురైంది. ఆమె ప్రస్తుతం మా దగ్గరే ఉంది. వెంటనే మేం అడిగినంత డబ్బును ఆన్‌లైన్ ద్వారా పంపించండి. లేకుంటే మీ అమ్మాయిని కిడ్నాపర్లు చంపేస్తారు." అని బెదిరించారు. ఇదిగో మీ అమ్మాయి ఏడుస్తుందంటూ ఒక వాయిస్‌ని వినిపించారు.
ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్రత్త!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 11, 2024
స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను కిడ్నాపర్లు… pic.twitter.com/IqPAozDTXG
ఏడుస్తున్న గొంతు వినిపించడంతో కాలేజీకి వెళ్లిన తమ కూతురు కిడ్నాప్‌నకు గురైందని తల్లిదండ్రులు భావించారు. డబ్బులు పంపించేందుకు సిద్ధపడ్డారు. మోసగాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూనే తమ బంధువులకు ఈ విషయాన్ని చేరవేశారు. తమ కూతురు కాలేజీలో ఉందో.. లేదో తెలుసుకోండని వారిని పంపించారు. ఆమె కాలేజీలో క్షేమంగా ఉందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ తరహా బెదిరింపు ఫోన్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని, ఆడ పిల్లలను కిడ్నాప్ చేశారని చెప్పగానే నమ్మి వారికి డబ్బులు పంపిస్తున్నారని ఆయన తెలిపారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి విదేశీ ఫోన్ నంబర్లతో వచ్చే వాట్సాప్ కాల్స్‌కు స్పందించవద్దని సజ్జనార్ సూచించారు. బెదిరింపులకు జంకకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వీసీ సజ్జనార్ సవివరంగా పోస్ట్ చేశారు.